గరుడధాత్రి :
నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న భూపతి సత్యవేడు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయినట్లు ఎస్‌ఐ సునీల్ తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో ఐదు సంవత్సరాల పాటు సేవలందించిన అనంతరం సాధారణ బదిలీపై ఆయన సత్యవేడుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారశైలితో భూపతి ప్రత్యేక గుర్తింపు పొందారు. నాగలాపురం మండల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించడంతో పాటు, ప్రతి ఒక్కరికీ సమానంగా న్యాయం అందేలా కృషి చేశారని స్థానికులు కొనియాడారు.
ప్రజల సమస్యలను ఓర్పుతో విని, పోలీస్ శాఖపై విశ్వాసం పెంపొందించేలా పనిచేసిన భూపతి సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు. ఇంత మంచి కానిస్టేబుల్ బదిలీపై వెళ్లడం బాధాకరమని, ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని స్థానికులు ఆకాంక్షించారు. నాగలాపురంలో ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రజలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శనివారం నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ సునీల్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సేవకులు, స్థానిక నేతలు కలిసి కానిస్టేబుల్ భూపతిని ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి పూలమాలలు వేసి ఆయన సేవలను అభినందించారు. నాగలాపురంలో ప్రజలకు అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడుతూ, సత్యవేడు పోలీస్ స్టేషన్‌లో కూడా ఇదే విధంగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
