* లక్ష కోట్ల తో గ్లోబల్ హార్టికల్చర్ హబ్.
* తలమానికంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్.
* పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అనంత్ అంబానీ, అచ్చం నాయుడు, బిజెపి చీఫ్ మాధవన్.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్01( ఆర్. శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్):అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ల శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం ఈ చారిత్రాత్మక ఘట్టానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రూ.1 లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్, వ్యవసాయ, ఉద్యానవన రంగాల్ని లాభసాటిగా మార్చేలా రైతులకు సేవలందించనుంది ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమ సందర్భంగా అధికారులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణాన్ని, వేదికను ఫల, పుష్ప ప్రదర్శనశాలను తలపించేలా పండ్లు, పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పండించే వివిధ రకాల ఉద్యాన పంటల ఉత్పత్తులతో ఏపీ మ్యాప్ను, రాయలసీమ సాగును ప్రతిబింబించేలా పళ్ల ఉత్పత్తులతో నింపిన ఎడ్ల బండి ప్రదర్శనను ప్రత్యేకంగా రూపొందించారు.
మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రిలకు నివాళులు: హార్టికల్చర్ హబ్కు శంకుస్థాపన చేసే నిమిత్తం మదనపల్లికి శుక్రవారం వచ్చిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అచ్చం నాయుడు, బిజెపి చీఫ్ మాధవన్లు మహాత్మా గాంధీ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మా తెలుగు తల్లి, జనగణ మన గీతాలతో సభ ప్రారంభమైంది. రాయలసీమపై రూపొందించిన లఘు చిత్రాన్ని సమావేశ ప్రారంభ సందర్భంగా ప్రదర్శించారు. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన రైతులు కూటమి నాయకులు అభిమానులు ప్రజల తో సమావేశ ప్రాంతం కిటకిట లారింది.
