పలమనేరు, అక్టోబర్ 26 (గరుడ ధాత్రి):
గంగవరం మండలంలోని మేలుమాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తమ ఉదారతను చాటుకున్నారు. పాఠశాలకు చెందిన 2011-12 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు, ఒక తరగతి గది ఫ్లోరింగ్ నిర్మాణానికి అవసరమైన రూ. 25,000 విలువైన టైల్స్‌ను సోమవారం నాడు పాఠశాలకు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిపై పూర్వ విద్యార్థులు చూపిన చొరవను అభినందించారు. దాతలు అందించిన ఈ సహకారంతో ఒక తరగతి గది అందంగా రూపుదిద్దుకుని, విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందని కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులందరూ దాతల సహకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులైన పురుషోత్తం, వేణు, శివశంకర్, సతీష్, గోవింద స్వామి, జయకృష్ణ, చలపతి తదితరులు పాల్గొన్నారు. తమ చదువుల తల్లి రుణం తీర్చుకునేందుకు ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులను గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది అభినందించారు.
