ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సత్యవేడులో మట్కా రాకెట్ గుట్టురట్టు

సత్యవేడులో మట్కా రాకెట్ గుట్టురట్టు

📰 Generate e-Paper Clip

ముగ్గురు నిందితుల అరెస్ట్.. రూ.12 వేల నగదు, మొబైల్ స్వాధీనం

సత్యవేడు జూలై 08 గరుడధాత్రి :

సత్యవేడు పట్టణంలో అక్రమంగా సాగుతున్న మట్కా -కాటన్ బెట్టింగ్ రాకెట్‌పై పోలీసులు కొరడా ఝళిపించారు. పక్కా సమాచారంతో పోలీసులు నిర్వహించిన మెరుపు దాడిలో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.12,000 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక మరికొందరు ఏజెంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పుత్తూరు డీఎస్పీ, సత్యవేడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో సత్యవేడు ఎస్‌ఐ, సిబ్బంది శుక్రవారం రాత్రి దాడి నిర్వహించారు. 07-08-2026 రాత్రి సుమారు 8 గంటల సమయంలో సత్యవేడు టౌన్ పల్లపు వీధిలోని శంకర్ టీ షాప్ వద్ద కొందరు వ్యక్తులు గుంపుగా చేరి అక్రమంగా నంబర్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా, పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురిని సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో పల్లపు వీధికి చెందిన ఎం. శ్రీనివాసులు @ శీనయ్య (65) ప్రధాన నిర్వాహకుడిగా, కోట వీధికి చెందిన ఎం. వెంకటేష్ @ ఎర్రయ్య (56), డిపో రోడ్డుకు చెందిన పీ. బాబు (54) ఏజెంట్లుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

– రూ.1కు రూ.60 అంటూ మోసం

పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నిందితులు 1 నుంచి 100 వరకు నంబర్లతో మట్కా చీట్లు విక్రయిస్తూ, ఒక్క రూపాయి చెల్లిస్తే లాటరీలో వచ్చిన నంబర్‌కు రూ.60 చెల్లిస్తామని ప్రజలను ఆకర్షిస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్‌బుక్ ద్వారా వచ్చే లాటరీ ఫలితాలను ఆధారంగా చేసుకుని ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

– ప్రధాన నిర్వాహకుడి కోసం గాలింపు

సేకరించిన బెట్టింగ్ డబ్బును వరదయ్యపాలెం మండలం కంచరపాలెంకు చెందిన మచ్చ తులసీరాంకు పంపిస్తూ కమీషన్ పొందుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరి పరిధిలో దీనాలు, శేఖర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మచ్చ తులసీరాం, దీనాలు, శేఖర్ కోసం గాలింపు చేపట్టారు. మట్కా, జూదం తదితర అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!