రెండేళ్ల పాలన.. సంక్షేమం – అభివృద్ధి పేరిట ఘనంగా నిర్వహణ
పలమనేరు, జూన్ 15 ( గరుడ ధాత్రి ) : కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలమనేరు నియోజకవర్గంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద “రెండేళ్ల పాలన.. సంక్షేమం – అభివృద్ధి” పేరిట నిర్వహించనున్న విజయోత్సవ సభకు పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి నాయకత్వం వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు సోమవారం నుంచే ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే స్థానిక నేతలకు సూచించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడమే విజయోత్సవ సభ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రజా సంక్షేమానికి చేపట్టిన చర్యలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలను సభలో ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలో గత రెండేళ్ల కాలంలో చేపట్టిన రోడ్లు, తాగునీటి పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో జరిగిన పురోగతిని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తోందని, ఈ విజయోత్సవ సభ అందుకు నిదర్శనంగా నిలుస్తుందని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
