సత్యవేడు సబ్ జైలుకు మూత..!
-భద్రతా లోపాల కారణంగా ఖైదీలను చిత్తూరుకు తరలింపు
గరుడధాథ్రి :
సత్యవేడు పట్టణానికి మరో కీలక ప్రభుత్వ సంస్థ దూరమైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన సత్యవేడు సబ్ జైలు మంగళవారం నుంచి అధికారికంగా మూతపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జైలు భవనం శిథిలావస్థకు చేరుకోవడం, పైకప్పు దెబ్బతినడం, ప్రహరీ గోడలు పటిష్టంగా లేకపోవడం వంటి భద్రతా లోపాలను గుర్తించిన జైలు శాఖ ఉన్నతాధికారులు జైలును మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జైలులో ఉన్న ఏడుగురు రిమాండ్ ఖైదీలను కట్టుదిట్టమైన భద్రత మధ్య చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. ఇకపై సత్యవేడు, నాగలాపురం, వరదయ్యపాలెం, పిచ్చాటూరు మండలాల్లో నమోదయ్యే కేసుల్లో రిమాండ్‌కు వెళ్లే నిందితులను చిత్తూరుకు తరలించాల్సి ఉంటుంది.
-పోలీసులకు అదనపు భారం
సబ్ జైలు మూసివేతతో పోలీస్ శాఖపై అదనపు భారం పడనుంది. ఒక్క రిమాండ్ ఖైదీని చిత్తూరుకు తరలించాలన్నా కనీసం ఇద్దరు పోలీసు సిబ్బంది బందోబస్తుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోలీస్ శాఖకు ఇది మరింత భారంగా మారనుంది. డిప్యూటేషన్‌లపై పలువురు సిబ్బంది ఇతర ప్రాంతాల్లో పనిచేస్తుండటంతో స్థానికంగా అందుబాటులో ఉన్న సిబ్బంది సంఖ్య కూడా పరిమితంగానే ఉంది.
అంతేకాకుండా ఖైదీలను పరామర్శించేందుకు వారి కుటుంబ సభ్యులు, బంధువులు దాదాపు 110 కిలోమీటర్ల దూరంలోని చిత్తూరుకు వెళ్లాల్సి రావడం మరో సమస్యగా మారింది.
-వన్ బై వన్‌గా తరలిపోతున్న ప్రభుత్వ కార్యాలయాలు
సత్యవేడు కేంద్రంగా పనిచేసిన పలు ప్రభుత్వ కార్యాలయాలు గత కొన్నేళ్లుగా ఒక్కొక్కటిగా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయన్న ఆవేదన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఎక్సైజ్ శాఖ కార్యాలయం నాగలాపురంకు, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం పుత్తూరుకు మారగా, ఒకప్పుడు ఇంజనీర్లతో కళకళలాడిన తెలుగు గంగ ప్రాజెక్టు డీఈ కార్యాలయం కూడా కుదించబడింది. ప్రస్తుతం కేవలం ఏఈతో పాటు ఇద్దరు సిబ్బందితోనే కొనసాగుతోంది.
ఇప్పుడు సబ్ జైలు కూడా మూతపడటంతో సత్యవేడు ప్రాధాన్యత మరింత తగ్గిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలల భవిష్యత్తుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణమా?
సత్యవేడు సబ్ జైలు తొలగింపు గురించి గత రెండేళ్లుగా ప్రచారం జరిగినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు జైలు బలోపేతం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుని ఉంటే జైలు మూతపడే పరిస్థితి వచ్చేదే కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
-ప్రగతికి దిక్కేది..?
తమిళనాడు సరిహద్దులో ఉన్న సత్యవేడు అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యానికి గురవుతోందనే భావన ప్రజల్లో బలపడుతోంది. నియోజకవర్గంలో నడుస్తున్న మట్టి క్వారీల ద్వారా రోజుకు లక్షల రూపాయల ఆదాయం వస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నప్పటికీ, ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు ఒక్కొక్కటిగా తరలిపోతుండగా వాటి స్థానంలో కొత్త సంస్థలను తీసుకురావడంలో నాయకత్వం విఫలమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజల అసంతృప్తి ప్రతిఫలించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
“సత్యవేడు అభివృద్ధి రివర్స్ గేర్‌లో పడిందా?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు పాలకులు, ప్రజాప్రతినిధులపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
