ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమెగా పీటీఎంలో రాష్ట్ర స్థాయి విజేత విద్యార్థికి ఘన సత్కారం

మెగా పీటీఎంలో రాష్ట్ర స్థాయి విజేత విద్యార్థికి ఘన సత్కారం

📰 Generate e-Paper Clip

గరుడదాత్రి న్యూస్ మైదుకూరు , జూలై 24
మైదుకూరు జడ్పీహెచ్‌ఎస్‌లో ప్రధానోపాధ్యాయులు రామమోహన్ అధ్యక్షతన నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) అత్యంత వైభవంగా జరిగింది. విద్యార్థుల విద్యాభివృద్ధి, ప్రతిభా ప్రోత్సాహానికి వేదికగా నిలిచిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి లాంగ్ జంప్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన ఐఈడీ విద్యార్థి ఎన్. భద్రను మెడల్, ప్రశంసాపత్రం, నగదు పారితోషికంతో ఘనంగా సత్కరించారు.
సత్కార కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనై మాట్లాడుతూ, “ప్రత్యేక విద్య ఉపాధ్యాయురాలు ఎస్. సునీత మేడం అందించిన నిరంతర శిక్షణ, ఆప్యాయత, ప్రోత్సాహం, సహకారం వల్లే మా కుమారుడు ఈ స్థాయికి చేరుకున్నాడు. ఆమె చూపిన అంకితభావం లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రుల మాటలు సభలోని అందరినీ కదిలించాయి.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ రంగస్వామి మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం కీలకమని అన్నారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయిలో విద్యార్థిని తీర్చిదిద్దిన ప్రత్యేక విద్య ఉపాధ్యాయురాలు ఎస్. సునీతను అభినందించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఐఈడీ కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య, స్కూల్ స్టాఫ్ సెక్రటరీ ఆవుల శ్రీనివాసులు, ఎస్ఎంసీ చైర్మన్ శివశంకర్, సీనియర్ ఉపాధ్యాయులు రాముడు, పద్మజ, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!