పలమనేరు మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించిన ఆర్జేడీ
వివిధ జిల్లాల రైతు బజార్లకు 30 మెట్రిక్ టన్నుల టమోటాల సరఫరా
పలమనేరు, జూలై 28 ( గరుడ ధాత్రి ) :
రాష్ట్రంలోని టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వేగవంతంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కడప ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు (ఆర్జేడీ) సి. రామాంజనేయులు మంగళవారం పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక మార్కెట్లో టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోకుండా నిరోధించడం, రైతులకు నష్టం వాటిల్లకుండా లాభసాటి ధర కల్పించడమే లక్ష్యంగా కొనుగోళ్లు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న రైతు బజార్లకు తరలించేందుకు సిద్ధం చేసిన 30 మెట్రిక్ టన్నుల టమోటాల నాణ్యతను, గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ ప్రక్రియలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పలమనేరు నుంచి సేకరించిన టమోటాలను గుంటూరు జిల్లా : గుంటూరు, చీరాల రైతు బజార్లు ,
తూర్పు గోదావరి జిల్లా : రాజమహేంద్రవరం రైతు బజార్ , ప్రకాశం జిల్లా : ఒంగోలు రైతు బజార్,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : నెల్లూరు రైతు బజార్లకు సరఫరా చేస్తున్నారు. ఒక్క పలమనేరు మాత్రమే కాకుండా మదనపల్లి, గుర్రంకొండ, ములకలచెరువు, పుంగనూరు, సోమల మార్కెట్ యార్డులతో పాటు అనంతపురం జిల్లా నుండి కూడా టమోటాలను సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బజార్లకు సరఫరా చేస్తున్నట్లు ఆర్జేడీ రామాంజనేయులు పేర్కొన్నారు. ఒకవైపు రైతులకు సరైన మద్దతు ధర అందిస్తూనే, మరోవైపు వినియోగదారులకు నాణ్యమైన టమోటాలను అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ శాఖ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి వి. సంజీవ కుమార్తో పాటు మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
