ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పారిశ్రామిక ప్రగతికి మార్గదర్శిగా శ్రీసిటీ -18 ఏళ్ల సుస్థిర ప్రగతి ప్రస్థానం

పారిశ్రామిక ప్రగతికి మార్గదర్శిగా శ్రీసిటీ -18 ఏళ్ల సుస్థిర ప్రగతి ప్రస్థానం

📰 Generate e-Paper Clip

సత్యవేడు , ఆగస్టు 08, గరుడధాత్రి :

దక్షిణ భారతదేశంలో ఒక పారిశ్రామిక విప్లవానికి నాందిగా మొదలైన ‘శ్రీసిటీ’, నేడు 18 వసంతాలను పూర్తి చేసుకుని, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ పారిశ్రామిక హబ్‌గా ఎదిగింది. రాష్టానికి తలమానికంగా, దేశ పారిశ్రామిక ప్రగతికి మార్గదర్శిగా సుస్థిర అభివృద్ధి సాధించింది. దేశ విదేశాల బ్యూరోకాట్లు, వ్యాపార ప్రతినిధులు, విద్యావేత్తలు అధ్యయనం చేసే ఉత్తమ మోడల్‌గా కీర్తి గడించింది.

8 వేలకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న శ్రీసిటీలో ప్రస్తుతం 31 దేశాలకు చెందిన 260కుపైగా దేశ విదేశీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తద్వారా రూ.53 వేల కోట్లకు పైగా పెట్టుబడులు, రూ.57,500 కోట్లకు పైగా ఎగుమతులు నమోదుకాగా, 75 వేల మందికిపైగా ప్రత్యక్ష ఉపాధి లభించింది. ఎయిర్ కండిషనర్లు, ఆటోమొబైల్స్, మెట్రో కోచ్‌లు, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, ఆహార ప్రాసెసింగ్, వినియోగ వస్తువుల తయారీలో శ్రీసిటీ దేశంలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా నిలిచింది. డైకిన్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, ఇసుజు, ఆల్స్టమ్, మోండెలీజ్, కోల్‌గేట్, కెలాగ్స్, కింబర్లీ-క్లార్క్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి నుంచి దేశీయ, విదేశీ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. సముద్ర తీర పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఎస్‌ఈజెడ్, ఎఫ్‌టిడబ్ల్యూజెడ్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ వంటి మౌలిక సదుపాయాలు శ్రీసిటీ అభివృద్ధికి బలంగా నిలిచాయి.

-కూల్ క్యాపిటల్‌గా మరింత పటిష్టం

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, ఓజీ ఇండియా ప్యాకేజింగ్, సోలమ్ వంటి సంస్థల కొత్త పెట్టుబడులు, విస్తరణలతో శ్రీసిటీ దేశంలోని “కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇప్పటికే డైకిన్, బ్లూ స్టార్, క్యారియర్, హావెల్స్ లాయిడ్, అంబర్, ఈప్యాక్ డ్యూరబుల్ సహా 10 ప్రధాన ఏసీ తయారీ సంస్థలు, 30కుపైగా విడిభాగాల తయారీ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2027 నాటికి దేశంలో తయారయ్యే ఎయిర్ కండిషనర్లలో దాదాపు 60 శాతం శ్రీసిటీ నుంచే ఉత్పత్తి అవుతాయని అంచనా.

-విద్యా హబ్‌గా కొత్త అడుగు

క్రియా, ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలు, ఐఎఫ్ఎంఆర్ బిజినెస్ స్కూల్, చిన్మయ, అకార్డ్ సిబిఎస్ఈ స్కూల్స్ ఏర్పాటుతో విద్యా కేంద్రంగా కూడా విరాజిల్లుతున్న శ్రీసిటీలో ‘వర్క్-స్టడీ’ డ్యూయల్ మోడల్ ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి ఆధారిత విద్యకు ప్రాధాన్యం మరియు పరిశ్రమలతో విద్యను అనుసంధానిస్తూ శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఈ ఏడాది ప్రారంభించడం అభివృద్ధిలో మరో మైలురాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన కోర్సులు భవిష్యత్ ఉద్యోగావకాశాలకు బాటలు వేయనుంది.

-సామాజిక సేవా కార్యక్రమాలకు పెద్దపీట

పారిశ్రామిక ప్రగతితో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి శ్రీసిటీ నిరంతరం కృషి చేస్తోంది. 2009లో ప్రారంభమైన శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా 40కి పైగా పారిశ్రామిక భాగస్వాముల సహకారంతో ఇప్పటివరకు రూ.61 కోట్లకు పైగా సీఎస్‌ఆర్‌ నిధులను విద్య, వైద్యం, మౌళిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో వినియోగించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, వైద్య శిబిరాలు, తాగునీరు, పారిశుధ్య సదుపాయాల కల్పన, వృత్తి నైపుణ్య శిక్షణ, కమ్యూనిటీ లైబ్రరీల ఏర్పాటు, పచ్చదనం, జలవనరుల పునరుద్ధరణ వంటి అనేక కార్యక్రమాలను ఫౌండేషన్ చేపట్టింది. ఇప్పటివరకు 5,000 మందికి పైగా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించింది. ఈ కార్యక్రమాల ద్వారా జీవనోపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు మహిళా సాధికారత, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, సామాజిక అంశాల్లోనూ సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయి.

-విస్తరణతో లక్ష్యం దిశగా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీసిటీ విస్తరణకు అదనంగా 2,000 ఎకరాలను కేటాయించడంతో, ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని, సామాజిక సమ్మిళిత అభివృద్ధిని, పర్యావరణ బాధ్యతను సమన్వయం చేస్తూ భారతదేశంలో తదుపరి దశ తయారీ రంగ ఆధారిత వృద్ధికి శ్రీసిటీ ఒక ఆదర్శ నమూనాగా నిలుస్తోంది. నేడు గ్లోబల్ పారిశ్రామిక శక్తికేంద్రంగా ఎదిగిన శ్రీసిటీ, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికి అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ పారిశ్రామిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించే దిశగా పయనిస్తోంది.

-పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా మార్చేందుకు కృషి..

-డా. రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్

ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే దూరదృష్టితో 18 ఏండ్ల క్రితం శ్రీసిటీకి శ్రీకారం చుట్టాం. నేడు ఇది ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన తయారీ కేంద్రంగా ఎదిగి, భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. పెట్టుబడిదారులు మాపై ఉంచిన విశ్వాసం, మా ఉద్యోగుల అంకితభావం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం దీనికి తోడ్పాటు అందించాయి. మున్ముందు కూడా ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనకు కట్టుబడి, ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో శ్రీసిటీ తన వంతు పాత్రను మరింత బలోపేతం చేస్తుంది. అలాగే పారిశ్రామిక వృద్ధితో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చేయడం మా ప్రాధాన్యత. నిరంతర సీఎస్‌ఆర్ కార్యక్రమాల ద్వారా దీనిని ముందుకు తీసుకువెళతాం.

-వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీసిటీలో రక్తదాన శిబిరం..

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా శ్రీసిటీ 18 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన శిబిరంలో పలు పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు 325 మంది రక్తదానం చేశారు. యాక్సెలెంట్ ఫార్మా, టీఐఎల్ హెల్త్‌కేర్, ఎన్‌జీసీ, టీఎచ్‌కే, రాక్‌వర్త్, బ్రేక్స్ ఇండియా తదితర పరిశ్రమల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.శిబిరంపై విశేష స్పందన రావడం పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు ఎంతో ముఖ్యమైన రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన దాతలను అభినందిస్తూ, వారికి ప్రశంసా పత్రాలను అందచేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!