డిఎస్సీ అంశంపై ఆడుతున్న డ్రామాలు ఆపాలి
వైకాపా నేతల రిలే దీక్షలపై టీడీపీ నేతల విమర్శలు
పలమనేరు, ఆగస్టు 08( గరుడ ధాత్రి ) :
ప్రజలు ఈ అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితిలో లేరని, కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు సంతోషంగా ఉన్నారని పలమనేరు పట్టణ టీడీపీ నాయకులు ఆరోపించారు. డీఎస్సీ అంశంపై వైకాపా చేస్తున్న రిలే దీక్షలను ఖండిస్తూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజులు ప్రసంగించారు. గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ తీవ్ర అప్పుల పాలై, బీహార్ కంటే ఘోరమైన పరిస్థితిలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాటలో నడిపిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు రోజుకో ‘ధండయాత్ర’ పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. నిజమైన బాధితులను పరామర్శించకుండా, తమ పార్టీకి చెందిన అల్లరిమూకలు లేదా రౌడీ షీటర్లను పరామర్శిస్తున్నారని విమర్శించారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత CI ని కూడా అరెస్ట్ చేసినప్పటికీ, ప్రతిపక్ష నాయకుడు దానిపై రాజకీయం చేస్తున్నారన్నారు.
సీదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో ఒక బిసీ కులానికి చెందిన వ్యక్తి చనిపోతే, దాన్ని పట్టించుకోకుండా నిందితుడికే మద్దతుగా మాట్లాడటం సరికాదన్నారు. గత ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చాలా పారదర్శకంగా డీఎస్సి నిర్వహిస్తోందని, మెరిట్ విద్యార్థులకే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. వచ్చేవారంలో రెండవ DSC కూడా విడుదల కాబోతోందని స్పష్టం చేశారు. డిఎస్సీ అభ్యర్థులెవరూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడంలేదని, కేవలం వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ వారు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాల్లో ప్రజల మద్దతు లేదని, కేవలం వాళ్ల పార్టీ నాయకులే కూర్చుంటున్నారన్నారు.ఈ సమావేశంలో నాయకులు సుబ్రహ్మణ్యం గౌడు, ఖాజా పీర్, కిరణ్, మదన్, శ్రీధర్,నదీమ్, గణేష్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
