పలమనేరు, ఆగస్టు 10 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు నియోజకవర్గం గంగవరం గ్రామానికి చెందిన యువ నాయకుడు ఉమా మహేష్ కు గుంటూరు జిల్లా బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) ఇన్చార్జిగా కీలక బాధ్యతలు దక్కాయి. విద్యార్థి దశ నుంచే జాతీయవాద భావజాలంతో ప్రజా, యువత సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఉమా మహేష్ సుమారు 13 ఏళ్ల పాటు ఏబీవీపీ లో క్రియాశీలకంగా పనిచేశారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు సేవలు అందించారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తూ విద్యార్థుల పక్షాన అనేక పోరాటాలు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. జాబ్ క్యాలెండర్ సాధన కోసం చేసిన ఉద్యమాలు, ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడి వంటి రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు. యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.అనంతరం బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) లో రాష్ట్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తూ, గతంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. యువతను పెద్ద సంఖ్యలో బీజేపీ వైపు ఆకర్షించడం, పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం, నూతన యువ కార్యకర్తలను తయారు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన సేవలను గుర్తించి గుంటూరు జిల్లా బీజేవైఎం ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి లకు ఉమా మహేష్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లాలో యువతను సమన్వయం చేసుకుంటూ, నియోజకవర్గం నుంచి బూత్ స్థాయి వరకు బీజేవైఎంను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం శ్రమిస్తానని ఉమా మహేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా బీజేవైఎం ఇన్చార్జిగా ఉమా మహేష్ నియామకం
RELATED ARTICLES
