ePaper
Monday, August 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జానపద కళలతో మార్మోగిన తిరుపతి.. ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు

జానపద కళలతో మార్మోగిన తిరుపతి.. ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

తిరుపతి, ఆగస్టు 22 గరుడధాత్రి: పల్లె పరిమళాన్ని, మన సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పే జానపద కళలతో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్ సందడిగా మారింది. ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని మన సంస్కృతి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి, భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం జానపద కళాకారులు, సాంస్కృతిక ప్రియులను అలరించింది.

మన సంస్కృతి వ్యవస్థాపకులు రెడ్డప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్వీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ నరసింగరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జానపద కళలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా.. మన పూర్వీకుల జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాలు, భావోద్వేగాలకు అద్దం పడతాయని ఆయన పేర్కొన్నారు. వివిధ జానపద బాణీల ప్రత్యేకత, వాటిలోని వైవిధ్యం, జానపద కళల ప్రాధాన్యతను వివరించారు.

-జానపద బాణీలో అన్నమయ్య కీర్తన

కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి హేమమాలిని జానపద బాణీలో అన్నమాచార్య కీర్తనను ఆలపించి సభికులను విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం ఆమె జానపద కళల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. ఆధునికత పెరుగుతున్న నేపథ్యంలో పల్లె కళలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆముదాల మురళి, శంభోల హరినాథ్, శంకరయ్య, శ్రీమతి నిర్మలతో పాటు పలువురు రిటైర్డ్ లెక్చరర్లు, జానపద కళాకారులు, సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
అనంతరం జానపద కళలను కాపాడుతూ, వాటి అభివృద్ధికి కృషి చేస్తున్న కళాకారులను మన సంస్కృతి సభ్యులు ఘనంగా సన్మానించారు. జానపద కళలకు తగిన ప్రోత్సాహం అందిస్తే అవి మరింతగా వికసించి మన సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!