*మార్కెట్ కమిటీ నియామకాలపై జనసేనలో అసంతృప్తి*
*కూటమి ప్రభుత్వం పై జనసేన పార్టీ మండల ఉప అధ్యక్షులు లీల ప్రసాద్ విమర్శలు*
నాగలాపురం మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకాల వ్యవహారం జనసేన పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నట్లు మండల ఉపాధ్యక్షుడు లీల ప్రసాద్ తెలిపారు. పార్టీ కోసం స్థాపన నుంచి కష్టపడి పనిచేసిన నిజమైన జనసైనికులను పక్కనపెట్టి, ఇతరులకు పదవులు కేటాయించడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా, ఒకటి రెండు పదవులతో సరిపెట్టడం జరుగుతుండగా, మిగతా అవకాశాలను తెలుగుదేశం పార్టీ నాయకులే అధికంగా అనుభవిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ విధానం వల్ల జనసేన కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, అసహనం నెలకొంటోందని పేర్కొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిని విస్మరించడం వల్ల భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగే అవకాశముందని హెచ్చరించారు. కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వకపోతే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు.
అందువల్ల, మార్కెట్ కమిటీ నియామకాలను తక్షణమే పునఃసమీక్షించి, జనసేన కోసం నిజాయితీగా పనిచేసిన వారికి న్యాయం చేయాలని లీల ప్రసాద్ డిమాండ్ చేశారు. సమానత్వం, పారదర్శకతతో పదవుల కేటాయింపు జరగాలని, కూటమిలో భాగమైన ప్రతి పార్టీకి సముచిత ప్రాధాన్యం కల్పించాలని ఆయన కోరారు.
