చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సంయుక్తంగా స్పందిస్తూ, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ప్రజా శ్రేయస్సు, చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధే తమ ఏకైక అజెండా అని ఉద్ఘాటించారు.
ఆదివారం చిత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ, నగరపాలక సంస్థలో నెలకొన్న సమస్యను పరిశీలించి, న్యాయం జరిగేలా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌తో తనకు ఎటువంటి వైషమ్యాలు లేవని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబయ, రాష్ట్ర మంత్రి లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని పరిణామాలు తమ ప్రమేయం లేకుండానే చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీలో గానీ, ఎంపీతో గానీ ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తనకు తండ్రి సమానులని, ఆయనతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
చిత్తూరు నియోజకవర్గాన్ని ప్రశాంతతకు మారుపేరుగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని, నగరపాలక సంస్థలో నెలకొన్న సమస్యలకు ఇప్పటికే పరిష్కార మార్గం చూపామని వెల్లడించారు. తాము నియోజకవర్గంలో లేని సమయంలో జరిగిన చిన్న ఘటన అనవసరంగా పెద్దదైందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు ఎంపీ నిధులను కూడా చిత్తూరు అభివృద్ధికి వినియోగిస్తున్నామని, ప్రజా ప్రయోజనాలే తమ ప్రాధాన్యమని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సమన్వయంతో కలిసి పనిచేస్తుండటం చిత్తూరు అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
