ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

📰 Generate e-Paper Clip

సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

*-అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి

– జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తుమ్మలపెంట పర్యటనకు ఎక్కడా లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో ఈనెల 19న సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 19న కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే “మత్స్యకారుల సేవలో” కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని, ఇక్కడ నుంచి మత్స్యకారుల బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సహాయం నగదును జమ చేస్తారని చెప్పారు. ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.
తుమ్మలపెంట వద్ద హెలీప్యాడ్, బహిరంగ సభ, పార్కింగ్, సీఎం కాన్వాయ్ రాకపోకలు, బందోబస్తు, ప్రజలకు సీటింగ్ ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యం, మొదలైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం బహిరంగ సభ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ* తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి గారు కావలి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారని, ఇది తమ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సముద్రంలో సాహసోపేతంగా ప్రాణాలను పణంగా పెట్టి మత్స్యకారులు మత్స్య సంపద సేకరించి జీవనం గడుపుతారని, అటువంటి మత్స్యకారులకు ప్రభుత్వం అండగా తోడుగా ఉంటుందని భరోసా కల్పించేందుకే స్వయంగా ముఖ్యమంత్రి తుమ్మలపెంట గ్రామానికి విచ్చేసి మత్స్యకార సేవలో కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రాక కోసం ఈ ప్రాంత మత్స్యకారులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, సీఎం రాక వాళ్లకు ఒక పండగ రోజుగా భావిస్తూ సీఎం పర్యటన ఏర్పాట్లలో వారు కూడా భాగస్వాములు అవుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు. జిల్లా యంత్రాంగం అందరూ సీఎం పర్యటనను విజయవంతం చేసి జిల్లా కలెక్టర్ కు, తనకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, మత్స్యకారులను ప్రేమతో సీఎం సభకు ఆహ్వానించి, అంతే ప్రేమతో వారిని తిరిగి పంపే వరకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఏఎస్పీ సౌజన్య, ఫిషరీస్ జెడి డాక్టర్ శాంతి, కావలి, ఆత్మకూరు ఆర్డీవోలు ఎలీషా, పావని, జడ్పీ సీఈఓ శ్రీధర్ రెడ్డి, డిపిఓ వసుమతి, విద్యుత్ శాఖ ఎస్ఈ రాఘవేంద్రన్, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్, పోలీసు, రెవెన్యూ అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!