120 మంది గ్రామీణ హస్తకళాకారుల నమోదు – ప్రభుత్వ పథకాలు, మార్కెట్ అవకాశాలపై అవగాహన
గరుడదాత్రి న్యూస్ మైదుకూరుజులై 20:
స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో భాగంగా, పి-4 (Public-Private-People Partnership) కార్యక్రమం ద్వారా గ్రామీణ హస్తకళాకారులను ప్రోత్సహించి వారి జీవనోపాధిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, భారత ప్రభుత్వ అభివృద్ధి కమిషనర్ (హస్తకళలు) కార్యాలయం, హస్తకళల సేవా కేంద్రం, తిరుపతి సహకారంతో సోమవారం మైదుకూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో చౌపాల్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మండలంలోని వోనిపెంట, పెద్దసెట్టిపల్లి, అక్కులాయపల్లి గ్రామాలకు చెందిన సుమారు 120 మంది హస్తకళాకారులు హాజరై నూతన కళాకారులుగా నమోదు చేసుకున్నారు. ఈ నమోదు ద్వారా ప్రభుత్వ హస్తకళల సంక్షేమ పథకాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, ఆర్థిక సహాయం, మార్కెటింగ్ సదుపాయాలు, జాతీయ స్థాయి ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశాలు, అలాగే ఇతర ప్రోత్సాహకాలు పొందేందుకు వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మైదుకూరు ఎంపీడీఓ శ్రీ కె.వి. శ్రీధర్ నాయుడు మరియు యంగ్ ప్రొఫెషనల్ శ్రీ వినోద్ కుమార్ పువ్వాడి మాట్లాడుతూ, వికసిత్ భారత్ మరియు స్వర్ణాంధ్ర–2047 ఆశయాలకు అనుగుణంగా “ఒక కుటుంబం – ఒక పరిశ్రామికవేత్త (One Family – One Entrepreneur)” అనే లక్ష్య సాధనలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని హస్తకళాకారులను గుర్తించి, ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
అదేవిధంగా, సంప్రదాయ హస్తకళలను పరిరక్షించడంతో పాటు వాటిని ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. పి-4 కార్యక్రమం ద్వారా ప్రభుత్వ శాఖలు, ఆర్థిక సంస్థలు, మార్గదర్శులు మరియు ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ కుటుంబాలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించడం స్వర్ణాంధ్ర–2047లో నిర్దేశించిన ప్రధాన లక్ష్యాలలో ఒకటని వివరించారు.
ఈ కార్యక్రమంలో పి-4 మార్గదర్శి మరియు ఓనిపెంట బ్రాస్ ఇండస్ట్రీ అధ్యక్షులు శ్రీ ఇస్మాయిల్, హస్తకళల సేవా కేంద్రం, తిరుపతి ప్రాంతీయ సహాయ మేనేజర్ శ్రీ వినోద్ దెహారు, లేపాక్షి మేనేజర్ శ్రీ ఎఫ్.ఎం. హుస్సేన్ (కడప), ఎస్‌బీఐ ఓనిపెంట శాఖ మేనేజర్ శ్రీ నాగరాజు తదితరులు పాల్గొని హస్తకళాకారులకు ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణ సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు హస్తకళల అభివృద్ధికి అందుబాటులో ఉన్న సేవలపై సమగ్ర అవగాహన కల్పించారు.
