గరుడ దాత్రి న్యూస్ జులై 21మైదుకూరు:
మైదుకూరు తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై మైదుకూరు అసెంబ్లీ ఈఆర్‌ఓ జాన్ వెస్లీ నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈఆర్‌ఓ జాన్ వెస్లీ మాట్లాడుతూ – ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా పూర్తి చేయడం తమ ప్రాధాన్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, అనర్హులు లేదా నకిలీ పేర్లను తొలగించేలా బిఎల్ఓ లు క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలన చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీలు, బిఎల్ ఎ లు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ బిఎల్ ఎ-1 ఆరవేటి హరికృష్ణ మేకల హరి జోహర్ మరియు ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను, ఓటర్ల పేర్ల నమోదు మరియు మార్పులు-చేర్పులపై తమ సూచనలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పక్కాగా ఓటర్ల జాబితా తయారు చేయడం అత్యంత కీలకమని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రతినిధులు కోరారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై స్పందించిన ఈఆర్ ఓ జాన్ వెస్లీ, నిబంధనలకు లోబడి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కార్యాలయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది మరియు వివిధ పార్టీల ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
