బైరెడ్డిపల్లి లోఎంపిటిసి, జెడ్పిటిసి అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్ పిలుపు
బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్29
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఏకపక్ష విజయాన్ని సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలమనేరు శాసనసభ్యులు అమర్‌నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.
బైరెడ్డిపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల పరిచయ వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావించి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే కూటమి అభ్యర్థుల విజయం కీలకమని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. ప్రజల్లో కూటమి పట్ల సానుకూలత ఉందని, ఆ ఆదరణను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు.
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను కూటమి నాయకులు పునరావృతం చేయకూడదని హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొంటూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని అన్నారు.
సమష్టి కృషి, ఐక్యతతో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ గౌడ్, సుబ్రహ్మణ్యం శెట్టి, భువన చంద్ర గౌడ్ తదితరులున్నారు.
