ePaper
Wednesday, June 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుల రాజకీయాలు చేస్తున్న వైసిపి...

కుల రాజకీయాలు చేస్తున్న వైసిపి…

📰 Generate e-Paper Clip

-బలిజ లను విభజించడం
ఎవరి తరం కాదు –
టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి
డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం

తిరుపతి, జూన్ 17 :

2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును వైసీపీ ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతోందని, అందుకే మళ్లీ కుల రాజకీయాలను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. కోడూరు బాలసుబ్రహ్మణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవల కాపు–బలిజ సమాజాల పేరుతో నిర్వహిస్తున్న సమావేశాలు, చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజలు తిరస్కరించిన విభజన రాజకీయాలను మళ్లీ ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.
బలిజ సమాజం రాజకీయ ప్రయోగాలకు వేదిక కాదని, వ్యాపారం, విద్య, సామాజిక సేవ, ఆలయ సంస్కృతి పరిరక్షణలో విశిష్ట స్థానం సంపాదించుకున్న ఈ సమాజాన్ని విభజించడం ఎవరి వల్లా కాదన్నారు. రాయలసీమ నుంచి కోస్తా వరకు బలిజ సమాజం మరింత ఐక్యంగా, చైతన్యవంతంగా ఉందని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ బలిజలను కేవలం ఓటర్లుగా కాకుండా నాయకులుగా తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. టీటీడీ ఛైర్మన్ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించి రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేర్చిందన్నారు. డా. చదలవాడ కృష్ణమూర్తి, మన్నూరు వెంకటరమణ, మన్నూరు సుగుణమ్మ, సుగవాసి పాలకొండ్రాయుడు, అన్నయ్యగారి సాయి ప్రతాప్, బత్యాల చెంగల్ రాయుడు వంటి నాయకులకు రాజకీయ వేదిక కల్పించిన ఘనత టీడీపీదేనన్నారు.
కాపు–బలిజ–తెలగ–ఒంటరి వర్గాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక నిర్ణయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుందని, విద్య, ఉద్యోగాలు, సామాజిక సాధికారతకు టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు.
2024లో ప్రజలు అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడులు, యువత భవిష్యత్తుకు అనుకూలంగా ఓటేశారని, కానీ వైసీపీ మాత్రం ఇప్పటికీ కుల రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు.
నారా చంద్రబాబు నాయుడు అనుభవం, నారా లోకేష్ యువ నాయకత్వం, పవన్ కళ్యాణ్ ప్రజా శక్తి, బీజేపీ మద్దతుతో రాష్ట్రంలో అభివృద్ధి ఆధారిత రాజకీయాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. జనసేన భాగస్వామ్యంతో కాపు–బలిజ ఐక్యత మరింత బలపడిందన్నారు.
రాజకీయ పునరుద్ధరణ కోసం వైసీపీ కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం మానుకుని, అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడులపై ప్రత్యామ్నాయ కార్యాచరణను ప్రజల ముందుంచాలని సూచించారు.
బలిజలను ఎవరూ విభజించలేరని,కులాల మధ్య చిచ్చు కాదు, సమాజాల మధ్య ఐక్యతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు” అని డా. కోడూరు బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!