* కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్.
* మల్లనూరు, గుండిసెట్టిపల్లి, తుమ్మిసి చెరువు ప్రాంతాల్లో పర్యటించిన కడ ప్రాజెక్ట్ డైరెక్టర్.
కుప్పం,జులై 31(గరుడ ధాత్రి న్యూస్): క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, ప్రజా సంక్షేమ దృక్పథానికి అనుగుణంగా ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడంతో పాటు విద్య, పర్యాటకం, ప్రజలకు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు.మల్లనూరు గ్రామంలో ప్రతిపాదిత జూనియర్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి స్థలాన్ని గుర్తించి, తుది నిర్ణయానికి అవసరమైన అంశాలను సమీక్షించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం గుండిసెట్టిపల్లి గ్రామంలో పీజీఆర్ఎస్లో అందిన దేవాలయ భూమి వివాదంపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. స్థానికులు, సంబంధిత అధికారులు మరియు ఇరుపక్షాలతో మాట్లాడి సమస్యను పూర్తిగా తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సమస్యను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుమ్మిసి చెరువు ప్రాంతాన్ని సందర్శించి చేపడుతున్న సుందరీకరణ పనులు, పిల్లల పార్కు పరికరాల ఏర్పాటు, ఓపెన్ జిమ్ పరికరాల ఏర్పాటు పనులను పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన కడ ప్రాజెక్ట్ డైరెక్టర్, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మరియు యువత ఉపయోగించుకునే విధంగా పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు.ఈ సందర్భంగా వికాస్ మర్మట్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా కుప్పం ప్రాంతంలో విద్య, మౌలిక సదుపాయాలు, పర్యాటక అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి కడ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి పనిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
RELATED ARTICLES
