-రెండు కిలోల గంజాయి, రెండు కత్తులు స్వాధీనం
సత్యవేడు, జూన్ 16: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్న సత్యవేడు పోలీసులు మరో కీలక విజయాన్ని నమోదు చేశారు. ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ సూచనలతో, సీఐ మురళీనాయుడు పర్యవేక్షణలో గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే, మరోవైపు అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన నిఘా కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఆధ్వర్యంలోని పోలీసు బృందం జూన్ 14న సిరణంబుదూరు బస్ స్టాప్ వెనుక రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద రెండు కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో బాలకృష్ణాపురం హరిజనవాడకు చెందిన సూర్య (23), హరి (25)లను అరెస్టు చేశారు. అనంతరం సూర్య ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
మీడియా సమావేశంలో ఎస్ఐ సాయినాథ్ చౌదరి మాట్లాడుతూ, నిందితులు తమిళనాడు నుంచి గంజాయి తెప్పించి చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. జీవనోపాధి కోసం చెన్నై వెళ్లిన వీరు అక్కడే నేర కార్యకలాపాలకు అలవాటుపడ్డారని తెలిపారు.
సూర్యపై తమిళనాడులో హత్యలు, దొంగతనాలు, రాబరీలకు సంబంధించిన 28 కేసులు నమోదై జైలుశిక్ష అనుభవించినట్లు, హరిపై కూడా హత్య, దొంగతనం, రాబరీ కేసులతో కలిపి 17 కేసులు నమోదై జైలుకు వెళ్లినట్లు వెల్లడించారు. వీరిద్దరిపై తమిళనాడు పోలీసులు నగర బహిష్కరణ చర్యలు కూడా తీసుకున్నట్లు తెలిపారు.
బాలకృష్ణాపురంలో నివసిస్తూ గంజాయి అక్రమ రవాణాతో పాటు మొబైల్ ఫోన్ దొంగతనాలకు కూడా పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇటీవల శ్రీసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొబైల్ ఫోన్ దొంగతనం కేసులో కూడా వీరు జైలుకు వెళ్లి వచ్చినట్లు చెప్పారు.
ఈ కేసులో మరో నిందితుడు తరుణ్ పరారీలో ఉండగా, గంజాయి రవాణా నెట్వర్క్కు సంబంధించిన మరికొంత మందిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై ఎవరైనా సమాచారం అందిస్తే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎస్ఐ లావణ్యతో పాటు పోలీసు సిబ్బంది ఈశ్వరయ్య, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
