పలమనేరు, సెప్టెంబర్ 03 ( గరుడ ధాత్రి ) :
గత నెల 25వ తేదీన పత్తికొండ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచి, మృతుడి బంధువుల కోసం వారం రోజుల పాటు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో గుర్తుతెలియని మృతదేహాన్ని పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ బృందానికి అప్పగించారు. మానవత్వంతో స్పందించిన హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు గురువారం ఆ గుర్తు తెలియని మృతదేహానికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు ఎవరూ లేని సమయంలో ఒక మనిషికి చివరి గౌరవం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ బృందం సభ్యులు శివ, నరేంద్ర, బాలాజీ, కుమార్ రాజు, శక్తి ప్రసాద్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.
*అభినందనలు మెండు*
ఎవరూ లేని వారికి మేమున్నామంటూ ముందుకు వచ్చి, గుర్తుతెలియని మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ సేవలను పలువురు అభినందించారు.
