కార్వేటి నగరం సెప్టెంబర్ 15 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరం మండల కేంద్రంలో సోమవారం వాడవాడలా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం అన్ని గ్రామాలలో యువత వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. పచ్చ తోరణాలతో కట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. విగ్రహాల వద్ద వివిధ రకాలైన పండ్లు పువ్వులు రంగులు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదపండితులు నడుమ వినాయకుని అభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉన్న ఇండ్లలో వినాయకుని ప్రతిమలు ఏర్పాటు చేశారు. వివిధ రకాల పిండి వంటలు తయారుచేసి నైవేద్యం సమర్పించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామాలలోని వీధుల్లో ఏర్పాటు చేసిన వినాయకుని దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పిల్లలు కేరింతలు మధ్య సాయంత్రం బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. మంగళ వాయిద్యాలు బ్యాండ్ వాయిద్యాల మధ్య కాపాసులు పేలుస్తూ విగ్రహాలను ప్రతిష్ట ఏర్పాటు చేశారు. సీఐ హనుమంతప్ప, ఎస్సై తేజస్విని ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
