* టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం ఉత్సవం.
* వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం.
* భక్తులందరికీ టీటీడీ ఆధ్వర్యంలో కంకణాల పంపిణీ.
* ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు అన్న ప్రసాదం వితరణ.
* ప్రతిఏటా పెరటాసి నెల మూడవ శనివారం స్వామివారి కల్యాణోత్సవం.
* పకడ్బందీ ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03( ఆర్. శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పం సమీపంలోని పరమ సముద్రం వద్ద ఉన్న శ్రీ బేటరాయ స్వామి కొండ వద్ద శనివారం శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో ఈ కల్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. కర్ణాటక,తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి కొండపై స్వామిని దర్శించుకుని, కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న వారందరికీ టీటీడీ ఆధ్వర్యంలో కంకణాలను పంపిణీ చేశారు. వేద మంత్రాల నడుమ కనుల పండుగగా శ్రీవారి కల్యాణోత్సవం జరిగింది. భక్తులు అత్యంత భక్తి పారవశంతో స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. కొండ ప్రాంతమంతా గోవింద నామస్మరణతో మారుమోగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తుల కోసం నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేసి అన్న ప్రసాదం వితరణ చేశారు. భక్తులకు అవసరమైన తాగునీటి వసతి కల్పించారు. కుప్పం ఏఎస్పీ హేమంత్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు బందోబస్తు పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, టిటిడి పాలకమండలి సభ్యులు శాంతారామ్, చంద్రబాబు కార్యదర్శి శ్రీకాంత్ లు శ్రీవారి కల్యాణోత్సవం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. ప్రతి సంవత్సరం పెరటాసి నెల మూడవ శనివారం శ్రీవారి కల్యాణోత్సవాన్ని టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. శనివారం కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో స్థానిక అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో మనోహర్, సంతోష్, వల్లెప్ప, వడివేలు, సమీప గ్రామాల గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
