సత్యవేడు జూన్ 22 గరుడధాత్రి :
చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షణ కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని స్థానిక ఎంఈఓ ఉష తెలిపారు. సోమవారం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ ఉష మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు 2012లో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. శారీరక వేధింపులు, లైంగిక దాడులు, అసభ్యకర స్పర్శలు వంటి నేరాలను ఈ చట్టం కింద తీవ్రంగా పరిగణిస్తారని వివరించారు.
ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి మాట్లాడుతూ, నేర తీవ్రతను బట్టి కనీసం మూడు సంవత్సరాల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు విధించే అవకాశం ఉందన్నారు. అత్యంత తీవ్రమైన కేసుల్లో మరణశిక్ష కూడా విధించవచ్చని తెలిపారు. బాధితులకు న్యాయం త్వరగా అందించేందుకు ఎఫ్ఐఆర్ నమోదైన 24 గంటలలోపు వైద్య పరీక్షలు నిర్వహించేలా చట్టంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భారతి, వాణి, ఢిల్లీ రాణి, అంగన్వాడీ టీచర్లు అనురాధ, భారతి మరియు పలువురు బాలికలు పాల్గొన్నారు.
చిన్నారుల రక్షణకే పోక్సో చట్టం
RELATED ARTICLES
