రూ.70 లక్షల వ్యయంతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్స్ నిర్మాణం
నారాయణవనం, సెప్టెంబర్ 21 గరుడధాత్రి న్యూస్:
విద్యార్థుల భవిష్యత్తుకు సైన్స్ విద్య ఎంతో కీలకమని, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం మరింత పెంపొందుతుందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం మండల కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు రూ.70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సైన్స్ ల్యాబ్స్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, చిత్తూరు ఉమ్మడి జిల్లాల జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు, సత్యవేడు నియోజకవర్గ టీడీపీ బీఎల్ఏ ఇన్చార్జి కోనేటి సుమన్ కుమార్ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు ల్యాబ్స్ ప్రారంభోత్సవం జరిగింది.
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జడ్పీటీసీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్‌లకు పాఠశాల యాజమాన్యం, గ్రామ ప్రజలు బాణసంచా కాల్చుతూ, మేళతాళాల నడుమ ఘన స్వాగతం పలికారు. పూలవర్షంతో వారికి ఆహ్వానం పలికారు. అనంతరం అతిథులు రిబ్బన్ కట్ చేసి నూతన సైన్స్ ల్యాబ్స్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనహరి మాట్లాడుతూ.. బాలికల ఉన్నత పాఠశాల అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ఇంటర్మీడియట్ స్థాయికి చేరుకుందని తెలిపారు. ఒకప్పుడు కొద్దిమంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాలలో ప్రస్తుతం సుమారు 480 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు.
పదో తరగతి అనంతరం ఇంటర్మీడియట్ విద్యను కూడా ఇక్కడే అభ్యసించే అవకాశం ఉండటంతో విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ బాలికల హాస్టల్ ఏర్పాటుతో పాటు అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు. పాఠశాల అభివృద్ధికి ఇప్పటికే సహకరిస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జడ్పీటీసీ కోనేటి సుమన్ కుమార్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి సహకరిస్తాం :
జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ.. బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ముందుంటానని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం బాలికల హాస్టల్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే అదనపు గదులతో పాటు మరిన్ని మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తానని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ నెట్ కేఫ్ చైర్మన్ ఆర్.డి. ఏకాంబరం, మాజీ వైస్ ఎంపీపీ టి. సుబ్రహ్మణ్యం, డిప్యూటీ డీఈఓ ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ అరుణ, తహసీల్దార్ భార్గవి, ఎంఈఓలు కోదండ నాయుడు, చంద్రశేఖర్ శెట్టి, మాజీ డిప్యూటీ ప్రభాకర్, రాజు, కస్తూరయ్య, స్థానిక నాయకులు మాణిక్యం రెడ్డి, బాలమురుగన్, అచ్చుకట్ల హరి, ఊరప్ప, పాఠశాల చైర్మన్ మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
