* నాలుగు రోజులు నాలుగు మండలాల్లో విస్తృత పర్యటన.
* మహిళలు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు.
* సేవా కార్యక్రమాలకు పెద్దపీట.
* దేవాలయాల సందర్శనకు ప్రాధాన్యం.
* పర్యటన ఆద్యంతము వెంటే పార్టీ యంత్రాంగం.
* గ్రామాల్లో ఎనలేని అభిమానం, అపూర్వ స్వాగతం.
* సమస్యల పరిష్కార నిమిత్తం అర్జీల సమర్పణ.
* పర్యటన విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు- పార్టీ ఇంచార్జ్ మునిరత్నం.
కుప్పం,జులై 30 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం పర్యటన విజయవంతమైంది. ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా నారా భువనేశ్వరి విస్తృతంగా పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలలో జరిగిన పలు కార్యక్రమాల్లో సీఎం సతీమణి పాల్గొన్నారు. ఈసారి పర్యటనలో దేవాలయాల సందర్శనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్హులైన వారికి తోపుడు బండ్లు, వినికిడి యంత్రాలు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు .అలాగే నాలుగు మండలాల్లో పాఠశాల విద్యార్థులతో మహిళలతోనూ ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు గౌరవం ఇవ్వాలని కోరారు. క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. ఈ పర్యటనలో నాలుగు రోజులు పాటు కుప్పం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నారా భువనేశ్వరి కి వినతి పత్రాలు అందజేశారు. తనను కలిసిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ నవ్వుతూ ప్రజలు విన్నవించే సమస్యలను వింటూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కుప్పం ప్రజలంతా తమ కుటుంబ సభ్యులని కుప్పం ప్రజలే తమ బలమని సమావేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంకు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలు సాదర స్వాగతం పలుకుతారో అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ప్రజలు నారా భువనేశ్వరి కి అపూర్వ స్వాగతం పలికారు. గ్రామాల్లో ప్రజలు, మహిళలు, నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో కోలాటాలతో హారతులు పట్టి తిలకం దిద్ది నారా భువనేశ్వరి కి అపూర్వంగా స్వాగతం పలికారు. పర్యటన చివరి వరకు తెలుగుదేశం పార్టీ యంత్రాంగమంతా భువనేశ్వరి వెంటే ఉన్నారు. ఆఖరి రోజు కుప్పం పట్టణంలోని కొత్తపేటలో నారా భువనేశ్వరి కి కనీవినీ ఎరుగని అపూర్వ స్వాగతం లభించింది.
అందరికీ ధన్యవాదాలు: కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజులు పాటు నారా భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం కృతజ్ఞతలు తెలిపారు.
నారా భువనేశ్వరి కుప్పం పర్యటన విజయవంతం
RELATED ARTICLES
