ePaper
Sunday, October 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపెన్షన్‌ కోసం పొలాల బాట పట్టాల్సిందేనా?

పెన్షన్‌ కోసం పొలాల బాట పట్టాల్సిందేనా?

📰 Generate e-Paper Clip

నీర్పాకోటలో లబ్ధిదారుల అవస్థలు.. సర్వేయర్‌ తీరుపై తీవ్ర ఆరోపణలు

“ఇంటి వద్దకే పెన్షన్‌ అందేది.. ఇప్పుడు గుడి, బడి దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది” అంటూ లబ్ధిదారుల ఆవేదన

సత్యవేడు అక్టోబర్ 02 గరుడధాత్రి న్యూస్ :

తిరుపతి జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని నీర్పాకోట పంచాయతీలో పెన్షన్‌ పంపిణీ తీరుపై లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెలంతా ఎదురుచూసే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ కోసం వృద్ధులు, వితంతువులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. చివరకు పెన్షన్‌ తీసుకునేందుకు పొలాల బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
లబ్ధిదారుల ఆరోపణల ప్రకారం.. పెన్షన్‌ పంపిణీలో సర్వేయర్‌ హరీష్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్‌ కోసం ఎదురుచూస్తున్న ఓ వితంతువుకు తాను కాంపాలెం గ్రామంలోని పొలంలో సర్వే పనుల్లో ఉన్నానని, అక్కడికే వచ్చి పెన్షన్‌ తీసుకోవాలని సర్వేయర్‌ సూచించినట్లు ఆమె ఆరోపించింది. దీంతో మనవడితో కలిసి పొలం వద్దకు వెళ్లిన తనను మరింత దూరం నడిచి రావాలని చెప్పడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాకుండా పెన్షన్‌ కోసం వెళ్లిన తనను వెంటనే నగదు అందించకుండా తిప్పించుకున్నారని, “నేను ఇచ్చినప్పుడే తీసుకోవాలి.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి” అంటూ దురుసుగా మాట్లాడారని ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారంపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“నెలంతా ఎదురుచూసే పెన్షన్‌ కోసం వృద్ధులు, వితంతువులు ఇలా తిరగాల్సి రావడం బాధాకరం. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పెన్షన్‌ కోసం వారిని ఇబ్బందులకు గురిచేయకూడదు” అని గ్రామస్థులు పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే పెన్షన్‌ పంపిణీ జరిగేదని కొందరు లబ్ధిదారులు గుర్తుచేస్తున్నారు. “సూర్యుడు ఉదయించకముందే పెన్షన్‌ మా ఇంటి వద్దకు వచ్చేది. ఇప్పుడు పెన్షన్‌ కోసం గుడి దగ్గరకో, బడి దగ్గరకో వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు కార్యాలయాలు, క్షేత్రస్థాయి పనుల్లో తమ విధులు నిర్వహించడం సహజమే అయినప్పటికీ, వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా పెన్షన్‌ పంపిణీ జరిగేలా చూడాల్సిన బాధ్యత ఉందని గ్రామస్థులు అంటున్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసినట్లు విచారణలో తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!