ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రభుత్వ పాఠశాలలకు శ్రీసిటీ చేయూత

ప్రభుత్వ పాఠశాలలకు శ్రీసిటీ చేయూత

📰 Generate e-Paper Clip

– రూ.43 లక్షలతో విద్యా వసతుల కల్పన
– పరిశ్రమల ప్రతినిధులచే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
గరుడధాత్రి :
శ్రీసిటీ ఫౌండేషన్ సమన్వయంతో శ్రీసిటీలోని చార్ట్ వీఆర్వీ, పార్క్సన్ ప్యాకేజింగ్, బెర్జిన్ పైప్స్ పరిశ్రమలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) కార్యక్రమాల కింద సుమారు రూ.43 లక్షల వ్యయంతో నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆయా సంస్థల ప్రతినిధులు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా, పారిశుధ్య, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

-బత్తలవళ్లం జెడ్పి హైస్కూల్‌లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి..

వరదయ్యపాలెం మండలం బత్తలవళ్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న బాలురు, బాలికల మరుగుదొడ్ల నిర్మాణ పనులను చార్ట్ వీఆర్వీ పరిశ్రమ రూ.12 లక్షల వ్యయంతో పూర్తి చేసింది. ఈ వసతులను చార్ట్ వీఆర్వీ డైరెక్టర్ (మ్యానుఫ్యాక్చరింగ్) ప్రసంజిత్ చటోపాధ్యాయ, శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్సార్) నిరీషా సన్నారెడ్డి ప్రారంభించారు.

-వరదయ్యపాలెం జెడ్పి హైస్కూల్‌లో త్రాగునీటి షెడ్, బాలికల మరుగుదొడ్లు..

శ్రీసిటీలోని పార్క్సన్ ప్యాకేజింగ్ పరిశ్రమ రూ.18 లక్షల వ్యయంతో వరదయ్యపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల కోసం నూతన మరుగుదొడ్ల సముదాయం, త్రాగునీటి షెడ్ నిర్మించింది. ఈ సదుపాయాలను శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్సార్) నిరీషా సన్నారెడ్డి, పార్క్సన్ ప్యాకేజింగ్ ప్రొడక్షన్ హెడ్ అభిజిత్ సమక్షంలో ప్లాంట్ హెడ్ రాహుల్ నెర్కర్ ప్రారంభించారు.

+చెన్నవారిపాలెం పాఠశాలలో పలు విద్యా వసతులు..

వరదయ్యపాలెం మండలం చెన్నవారిపాలెం మోడల్ ప్రాథమిక పాఠశాలలో బెర్జిన్ పైప్స్ పరిశ్రమ సుమారు రూ.10 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో భాగంగా రెండు తరగతి గదుల మరమ్మతులు పాటు పాఠశాలకు ప్రధాన ద్వారం ఏర్పాటు చేసింది. అలాగే ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టి, నిరుపయోగంగా ఉన్న వంటగదిని మరమ్మతు చేసి వినియోగానికి అనువుగా తీర్చిదిద్దింది. ఈ వసతులను శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్సార్) నిరీషా సన్నారెడ్డి, బెర్జిన్ కంపెనీ ప్రతినిధులు సతీష్ రామచంద్రన్, అల్తాఫ్ ప్రారంభించారు.

-మాదనపాలెం పాఠశాలలో సమావేశ మందిరం పూర్తి..

బెర్జిన్ పైప్స్ పరిశ్రమ చొరవతో మాదనపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న సమావేశ మందిరం (మల్టీ పర్పస్ హాల్) నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇందుకోసం సంస్థ సుమారు రూ.3 లక్షలు వ్యయం చేసింది. ఈ వసతి విద్యార్థుల విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడనుంది. దీనిని కూడా కంపెనీ ప్రతినిధులు లాంచనంగా ప్రారంభించారు.
విద్యాభివృద్ధికి పరిశ్రమల భాగస్వామ్యం ప్రశంసనీయం..
ఈ సందర్భంగా శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్సార్) నిరీషా సన్నారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పరిశ్రమల సీఎస్సార్ చర్యలను అభినందించారు. కొత్తగా ఏర్పాటు చేసిన వసతులను విద్యార్థులు, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీసిటీ ప్రత్యేక చొరవతో పాటు పరిశ్రమల చురుకైన భాగస్వామ్యంతో ఈ ప్రాంతంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
కాగా, తమ విద్యా సంస్థల్లో వివిధ విద్యా వసతుల కల్పన పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలను గుర్తించి చేయూత అందించిన శ్రీసిటీ ఫౌండేషన్ మరియు శ్రీసిటీ పరిశ్రమల యాజమాన్యాలకు కృతఙ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!