*– రూ.22 కోట్ల వేతన బకాయిల విడుదలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హర్షం
కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా తీరని లోటుగా ఉన్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల వేతన బకాయిల సమస్యకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం లభించింది. దాదాపు 11 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.22 కోట్ల వేతన బకాయిలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడంపై కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడారు.
కార్మికుల కన్నీళ్లు చూసి ఇచ్చిన హామీ.. నేడు నెరవేరింది
తనకు మొదటిసారి ఎమ్మెల్యే టిక్కెట్ ప్రకటించిన తర్వాత లేగుంటపాడులో నిర్వహించిన సమావేశంలో కార్మికులు స్వయంగా వచ్చి తమ కష్టాలు వివరించారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు గుర్తుచేసుకున్నారు. ‘అప్పటి వరకు కోవూరులో ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందనే విషయంగానీ, అది మూతపడి కార్మికులకు 11 ఏళ్లుగా జీతాలు అందలేదనే విషయం కానీ నాకు తెలియదు. ఆ రోజు కార్మికుల ఆవేదనను చూసి మాటిచ్చాను. మన కూటమి ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి బకాయిలు ఇప్పిస్తానని చెప్పాను’ అని వివరించారు.
సీఎం చంద్రబాబు గారు, ఎంపీ వేమిరెడ్డి గారు చొరవతో ముందుకు..
ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు నాయుడు గారు బుచ్చిరెడ్డిపాళెం వచ్చినప్పుడు షుగర్ ఫ్యాక్టరీ వేతన బకాయిలు, ఇఫ్కో కిసాన్ సెజ్ అభివృద్ధి గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే గారు చెప్పారు. ‘అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కలెక్టర్ హిమాన్షు శుక్లా గారితో కలిసి పలుమార్లు సుదీర్ఘంగా చర్చించాం. నేను స్వయంగా అసెంబ్లీ వేదికగా కార్మికుల సమస్యలు వినిపించాను. పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారితో కలిసి వెళ్లి ఫ్యాక్టరీని కూడా పరిశీలించాను’ అని తెలిపారు.
కార్మికుల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన నిక్కగల్ నాగేశ్వరరావు గారి సేవలను ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘ఆయన తీరిక లేకుండా కష్టపడటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. వ్యక్తిగతంగా నేను సాయం అందించినప్పటికీ ఆయనను కాపాడుకోలేకపోవడం తీవ్ర విచారకరం’ అని అన్నారు.
*అందుకే.. ఆలస్యమైంది…
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమాన్ని ఆలోచించి రూ.22 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోవూరు ప్రజల తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు తెలిపారు. ‘మధ్యలో కొందరు షేర్ హోల్డర్లు కోర్టుకు వెళ్లి లిక్విడేషన్‌పై స్టే తీసుకురావడం వల్ల అనుకున్న సమయానికి కొంత ఆలస్యమైనా, చివరకు ఇచ్చిన మాట ప్రకారం బకాయిలు చెల్లించగలిగాం. ఎన్నో ఏళ్లుగా మిగిలిపోయిన సమస్యలను తీర్చడం ఒక్క కూటమి ప్రభుత్వానికే సాధ్యం’ అని స్పష్టం చేశారు.
కోవూరు యువత, రైతులకు త్వరలోనే శుభవార్త
షుగర్ ఫ్యాక్టరీ భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతోందని ఎమ్మెల్యే గారు వెల్లడించారు. ‘కోవూరు నియోజకవర్గ రైతాంగానికి, ప్రజలకు, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించేలా ఈ ప్రాంత భవిష్యత్తును మార్చే వినూత్న నిర్ణయాన్ని త్వరలోనే చంద్రబాబు గారి నాయకత్వంలో తీసుకోబోతున్నాం’ అని తెలియజేశారు.
