వినియోగదారుడిపై పోలీస్ స్టేషన్‌లో విద్యుత్ శాఖ అధికారుల ఫిర్యాదు
కార్వేటినగరం, అక్టోబర్ 25 గరుడదాత్రి న్యూస్:
విద్యుత్ బకాయిలు చెల్లించాలని కోరిన విద్యుత్ శాఖ సిబ్బందిపై ఓ వినియోగదారుడు దుర్భాషలాడిన ఘటన కార్వేటినగరం మేజర్ పంచాయతీ పరిధిలోని మత్య విలాసం వీధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. మత్య విలాసం వీధిలోని విద్యుత్ సర్వీస్ నంబర్లు 31, 35కు సంబంధించి గత రెండు నెలలుగా విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో, బకాయిలు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో లైన్ ఇన్‌స్పెక్టర్ దామోదరం సంబంధిత వినియోగదారుడిని బకాయిలు చెల్లించాలని కోరగా, ఆయన విద్యుత్ శాఖ సిబ్బందిపై దుర్భాషలాడినట్లు అధికారులు తెలిపారు.
సదరు వినియోగదారుడు రూ.17,380 విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. సిబ్బందిపై దుర్భాషలాడిన ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, సంబంధిత విద్యుత్ సర్వీసును కూడా అధికారులు డిస్‌కనెక్ట్ చేసినట్లు సమాచారం.
విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించాలని, విధుల్లో ఉన్న సిబ్బందితో సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
