చౌడేపల్లి అక్టోబర్ 11 గరుడ దాత్రి న్యూస్
అన్నమయ్య జిల్లా మండల కేంద్రమైన చౌడేపల్లి ఆలయాలలో దసరా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బజార్ వీధిలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానము, మృత్యుంజయ స్వామి దేవస్థానం నందు, షిరిడి సాయిబాబా గుడి నందు, వేణుగోపాలస్వామి గుడి నందు, చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో, మరియు కళ్యాణ గంగమ్మ గుడి నందు వివిధ అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు:
దసరా నవరాత్రుల ప్రారంభం పురస్కరించుకుని ఆలయ అర్చకులు అమ్మవార్లకు అత్యంత భక్తిశ్రద్ధలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, విశేష అలంకారములు గావించారు. అనంతరం భక్తులకు అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
భక్తుల విశేష స్పందన:
తొలిరోజు కావడంతో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చౌడేపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వందలాది మంది ప్రజలు అమ్మవార్లను దర్శించుకుని అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు.
