శ్రీసిటీ, సెప్టెంబర్ 24, గరుడధాత్రి :
శ్రీసిటీలో అంతర్గత రహదారి మౌళిక వసతులు, రవాణా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా 4 కిలోమీటర్ల పొడవైన నూతన లింక్ రోడ్డును గురువారం ట్రాఫిక్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీసిటీ డీఎస్పీ బి.వి.శ్రీనివాసులు లాంఛనంగా రహదారిని ప్రారంభించగా, APIIC తిరుపతి జోనల్ మేనేజర్ విజయ భరత్ రెడ్డి, డైకిన్ సీనియర్ అధికారులు సుదీప్ భట్టాచార్య, ప్రశాంత్ జోషి, వెంకటేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు.
ఆరూరు–రాళ్లకుప్పం రోడ్డులో మల్లవారిపాలెం-ఆరూరు మధ్యలో వున్న ఈ రోడ్డు గతంలో తక్కువ వెడల్పుతో అనేక మలుపులతో సాగేది. దీని వలన ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలు సంభవించేవి. దీనికి ప్రత్యామ్నాయంగా అత్యుత్తమ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న నూతన రహదారితో వాహనాల రాకపోకలు మరింత సాఫీగా, సురక్షితంగా సాగేందుకు వీలుకలుగుతుంది.
దీనిపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ, నూతన లింకు రోడ్డుతో ఈ మార్గంలోని గ్రామస్థులకు మెరుగైన రోడ్డు సదుపాయం అందుబాటులోకి రావడంతో పాటు పరిశ్రమ వర్గాలకు కూడా ప్రయోజనం చేకూరనుందన్నారు. అలాగే శ్రీసిటీలో రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని పేర్కొన్నారు.
