పలమనేరు, సెప్టెంబర్ 19 ( గరుడ ధాత్రి ) :
పలమనేరును ‘స్వచ్ఛ స్వర్ణ పలమనేరు’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే “స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర “, “స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమాలను పలమనేరు పురపాలక సంఘం పరిధిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి దిశానిర్దేశంలో, మున్సిపల్ కమిషనర్ కె.లోకేశ్వర వర్మ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన సదస్సు, పారిశుద్ధ్య ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ…, పట్టణంలో మరింత మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పలమనేరుకు ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇళ్ల వద్దే తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలి. తడి చెత్తతో ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకోవాలన్నారు. పర్యావరణానికి హాని చేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి, వాటి స్థానంలో జనపనార (జ్యూట్) సంచులు మాత్రమే వాడాలన్నారు. పట్టణంలో మురుగునీటి సమస్య పరిష్కారానికి త్వరలోనే అధునాతన ఎస్టీపీ (సేవజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే పట్టణానికి ప్రధాన ఆకర్షణైన ‘పెద్ద చెరువు’ను అన్ని హంగులతో సుందరీకరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ సెక్రెటరీల ద్వారా ఎప్పటికప్పుడు ఫాగింగ్, బ్లీచింగ్ చేయిస్తున్నాం. వార్డుల్లో చిన్న, మధ్య, పెద్ద కాలువల పూడికతీత పనులను వేగవంతం చేశాం అన్నారు. చికెన్, మటన్ షాపుల వారు పరిశుభ్రత పాటించాలి. మాంసాన్ని గ్లాస్ బాక్సుల్లో, మందపాటి కవర్లతో కప్పి ఉంచాలి. ప్లాస్టిక్ కవర్లు వాడరాదు, వినియోగదారులు స్టీల్ బాక్సులు లేదా జ్యూట్ బ్యాగులు తెచ్చుకునేలా చూడాలి. మాంసం వ్యర్థాలను వీధి కుక్కలకు వేయకుండా, తప్పనిసరిగా మున్సిపల్ చెత్త వాహనాలకే అందించాలన్నారు. పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలి. టెర్రస్ గార్డెనింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్‌ను ప్రోత్సహించాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణ ప్రజలచే ‘స్వచ్ఛ ప్రతిజ్ఞ’ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మొహిద్దీన్, ఏ ఈ శిరీష సచివాలయ, మెప్మా సిఎంఎం బాబా, సిబ్బందితో పాటు మహిళా సంఘాల సభ్యులు, పలమనేరు పరిరక్షణ సమితి అధ్యక్షులు నరసింహులు, శ్రీపురం సీతారామయ్య, సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
స్వచ్ఛ స్వర్ణ పలమనేరు’గా తీర్చిదిద్దడమే లక్ష్యం -మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ
RELATED ARTICLES
