ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తిరుమలలో నకిలీ ఆధార్‌లతో రూమ్ దందా.. ఆరుగురు దళారీల అరెస్ట్

తిరుమలలో నకిలీ ఆధార్‌లతో రూమ్ దందా.. ఆరుగురు దళారీల అరెస్ట్

📰 Generate e-Paper Clip

తిరుమల, ఆగస్టు 8 గరుడధాత్రి :

తిరుమలలో భక్తుల గది కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న రూమ్ దళారీల ముఠా గుట్టురట్టైంది. నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో టీటీడీ గదులను పొందుతూ.. వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, ఐపీఎస్ ఆదేశాలతో తిరుమలలో రూమ్ దళారీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 8న ఉదయం తిరుమల CRO కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేయడంతో పాటు, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి టీటీడీ CROలో గదులు పొందుతున్నట్లు వెల్లడైంది. అనంతరం ఆ గదులను గదులు దొరకని భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అదే ముఠా తిరుమలలోని PAC-5 వద్ద ఛార్జింగ్‌కు పెట్టిన భక్తుల సెల్‌ఫోన్లను దొంగిలించినట్లు కూడా విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి గది బుకింగ్‌లు, నకిలీ గుర్తింపు పత్రాల వ్యవహారాలకు ఉపయోగించిన సెల్‌ఫోన్లతో పాటు, ఈ నెల 6న PAC-5 వద్ద చోరీకి గురైన రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20) ఉన్నారు. వీరిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

దళారీలను నమ్మొద్దు

తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు భక్తులకు సూచించారు. నకిలీ ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలతో గదులు ఇప్పిస్తామని చెప్పే దళారీలను నమ్మి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించారు.
రూమ్ దళారీల కార్యకలాపాలు లేదా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తించిన వెంటనే 112కు లేదా టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. భక్తుల భద్రత, సౌకర్యం కోసం పోలీసు, టీటీడీ విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో అక్రమ రూమ్ దందాపై నిరంతర నిఘా కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!