ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే- దేశం గెలుస్తుంది

రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే- దేశం గెలుస్తుంది

📰 Generate e-Paper Clip

* ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.
* 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్ర ప్రదేశ్.
* ఢిల్లీలో జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఫైర్ సైడ్ చాట్ లో ప్రసంగించిన మంత్రి లోకేష్.
కుప్పం,సెప్టెంబర్ 24 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి):రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే దేశం గెలుస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నానని ఆంధ్ర ప్రదేశ్ ఐటి విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఢిల్లీలో గురువారం అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా ఫైర్ సైడ్ చాట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పలు విషయాల పైన ప్రస్తావించారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను గుజరాత్ వెళ్తున్నానని, అదే విధంగా ఆక్వా రంగంలో పెట్టుబడుల కోసం గుజరాత్ ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశకు రావచ్చునని తెలిపారు. ఒక రాష్ట్రం ఏదైనా కొత్తగా చేసి మంచి ఫలితాలు సాధిస్తే ఇతర రాష్ట్రాలు కూడా దాని నుంచి త్వరగా నేర్చుకోవచ్చని, మనమందరం ఇదే రీతిలో పోటీపడుతూ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.ఏపీ లక్ష్యం సమగ్ర అభివృద్దేనని, అందుకోసం ప్రజలను నాలుగో భాగస్వామిగా చేరుస్తూ పీ-4 మోడల్ను అమలుచేస్తున్నామని అన్నారు. అభివృద్ధి ప్రయాణంలో పేదలు, వెనుకబడిన వర్గాలను విస్మరించకుండా కేవలం నగదు ఇవ్వడమే కాకుండా ఆలోచనలు, అనుభవం, మార్కెటింగ్, వ్యాపార నైపుణ్యాలపై మార్గదర్శకత్వం అందించడమే అసలైన ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ దిశగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి కొత్త అవకాశాలు పరిచయం చేయడంలో పరిశ్రమలు, కంపెనీలు కీలక పాత్ర పోషించాలని, రూ.60 వేల పెట్టుబడి, సరైన మార్గదర్శకత్వంతో ఇటుకల బట్టీలో పనిచేసే మహిళ సైతం 20 మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగిన అద్భుత మార్పులు ఏపీ నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయని వెల్లడించారు.స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు స్పీడ్ ఏపీ కల్చర్ గా మారిందన్నారు. స్పీడ్ ఈజ్ మనీ, టైం ఈజ్ మనీ అని పేర్కొన్నారు పేర్కొన్నారు.ఎవరూ ఇంకా పెద్దగా దృష్టి పెట్టని, ప్రారంభ దశలో ఉన్న కంపెనీలను గుర్తించి ముందుగానే వాటిపై పెట్టుబడి రూపంలో నమ్మకం ఉంచగలుగుతున్నాం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. “కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలను కూడా ముందుగానే సంప్రదిస్తున్నామని,రాష్ట్రంగా మేం వారికి మద్దతు ఇస్తున్నామన్నారు. అదే విధానాన్ని ఆర్సెలర్ మిట్టల్ విషయంలో కూడా అనుసరించామని, 3వేల ఎకరాల భూమిని ఇచ్చాం. వారు తమ పనులను ప్రారంభించారు. 17 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్నారు. ఫలితాలపై దృష్టిపెట్టి పనిచేస్తున్నాం. ఇదే మమల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఎందుకంటే స్పీడ్ ఈజ్ మనీ, టైం ఈజ్ మనీ” అని లోకేష్ పేర్కొన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల పర్యావరణంపై పడే భారం గురించిన ఆందోళనలపై స్పష్టత ఇచ్చారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణను సమతుల్యంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అవలంబిస్తోందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా డేటా సెంటర్ల విద్యుత్ అవసరాలలో కనీసం 70 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల (గ్రీన్ ఎనర్జీ) నుంచే వినియోగించాలని నిబంధన విధించినట్లు వెల్లడించారు. అలాగే, సముద్రంలో వృథాగా కలిసే పోలవరం నీటిని విశాఖలోని డేటా సెంటర్ క్లస్టర్ అవసరాలకు సమర్థవంతంగా వినియోగిస్తామని, ప్లాంట్ల ఏర్పాటుకు డీసాలినేషన్ సాంకేతికతను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ తరఫున అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు .ప్రాజెక్టులను గ్రౌండ్ చేయడం మా ఏకైక ప్రధాన ప్రాధాన్యత అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. “ప్రాజెక్టుల గ్రౌండింగ్ ను నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నా. సమస్యలు ఏవైనా ఉంటే కలిసి పరిష్కరిస్తాం. కాబట్టి స్పీడ్ ను ప్రభుత్వ కల్చర్ గా మార్చడం, దానికి క్లస్టర్ ఆధారిత విధానాన్ని జోడించడం. ఈ రెండూ కలిసి మనం ఈరోజు సాధిస్తున్న విజయాలకు కారణం అవుతున్నాయి. మేం కేవలం ఎంవోయూలపై ఆధారపడబోం. నాకు ఎంవోయూలపై సంతకం చేయడం అంతగా ఇష్టం లేదు. పార్టనర్షిప్ సమ్మిట్లో కొన్ని ఎంవోయూలు చేసుకున్నాం. కానీ మేం 80 శాతం గ్రౌండింగ్ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రాజెక్టు ఎంత త్వరగా గ్రౌండ్ అవుతుందో, అంత త్వరగా పన్నులు చెల్లిస్తారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.” అని తెలిపారు.సమ్మిళిత వృద్ధి కోసం రాష్ట్రం అనుసరిస్తున్న ‘పి4’ (ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం) నమూనా విజయాన్ని వివరించారు. కుప్పం నుండి ఒక పరివర్తన కథను ఉదహరిస్తూ, లోకేష్ ఒక విషయాన్ని పంచుకున్నారు. గతంలో ఇటుకల ఫ్యాక్టరీలో పనిచేసిన ఒక మహిళకు వ్యాపార ప్రాథమికాలు, మార్కెట్ యాక్సెస్, మార్కెటింగ్ విషయాలలో మార్గనిర్దేశం చేయడం ద్వారా, ఆమె కేవలం రూ60,000 పెట్టుబడితో తన సొంత ఫ్యాక్టరీని ప్రారంభించి, ఒక సంవత్సరంలోనే 20 మందికి ఉపాధి కల్పించగలిగారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” నుంచి “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, ప్రాజెక్టుల వేగవంతమైన అమలు, ముందస్తు పాలసీ నిర్ణయాలు మరియు సత్వర ఫైల్ క్లియరెన్సు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ‘మనమిత్ర’ వేదిక ద్వారా ప్రజలకు దాదాపు 1,000 పౌర సేవలను ఎంతో వేగంగా, పారదర్శకంగా అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 థీమాటిక్ క్లస్టర్ల ద్వారా సమగ్ర పారిశ్రామిక వాతావరణాన్ని (ఈకోసిస్టమ్) నిర్మిస్తున్నామని విద్యుత్, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పరిశ్రమలు, విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ, టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు అనుసంధానించడం ద్వారా వ్యాపార వ్యయాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పెట్టుబడులకు అత్యంత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, పారిశ్రామికవేత్తలు సులభంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు.పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే డేటా సెంటర్ల వృద్ధిని ప్రోత్సహించేందుకు రాష్ట్రం అనుసరిస్తున్న సమగ్ర వ్యూహాన్ని వివరించారు. సుస్థిరతను నిర్ధారించడానికి, డేటా సెంటర్లు ఉపయోగించే శక్తిలో కనీసం 70 శాతం సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీల వంటి పునరుత్పాదక వనరుల నుండి రావాలని రాష్ట్రం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా, విశాఖపట్నం డేటా సెంటర్ క్లస్టర్ నీటి అవసరాలను పోలవరం ఎడమ కాలువ ద్వారా తీరుస్తామని, అలాగే డీశాలినేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి లోకేష్ హైలైట్ చేశారు. తద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడం, పర్యావరణ ప్రమాణాలను పాటించడం మధ్య కీలక సమతుల్యతను సాధిస్తున్నట్లు తెలిపారు.
రాబోయే పదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందే వివిధ రంగాలపై దృష్టిపెడుతూ, ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆటోమొబైల్, బయోమెడికల్, ఏఐ, డేటా సెంటర్లతో పాటు అమరావతిలో ఐబీఎం 150-క్యూబిట్ క్వాంటం కంప్యూటర్తో పూర్తిస్థాయి క్వాంటం ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నామని వెల్లడించారు. అలాగే గూగుల్ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులు, క్రయోజెనిక్స్, రేర్ ఎర్త్ క్లస్టర్లు మరియు 50 వేల హోటల్ గదుల నిర్మాణంతో హాస్పిటాలిటీ రంగంలో భారీ ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అర్జిత్ సేన్ వ్యవహరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!