ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివేంబాకంలో పారిశుద్ధ్యం పడకేసింది

వేంబాకంలో పారిశుద్ధ్యం పడకేసింది

📰 Generate e-Paper Clip

ఐదు రోజులుగా తాగునీటికి తప్పని ఇబ్బందులు..!

ఏళ్ల తరబడి శుభ్రం చేయని వాటర్‌ ట్యాంక్‌ ..!!

తాగునీటిలో పురుగులు వస్తున్నాయని గ్రామస్తుల ఆవేదన..!

పంచాయతీ అధికారుల తీరుపై విమర్శలు..?

నాగలాపురం, అక్టోబర్‌ 2 గరుడధాత్రి:

నాగలాపురం మండలం వేంబాకం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లే ప్రక్రియ చేపట్టకపోవడంతోపాటు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించే చర్యలు కూడా కనిపించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, ఈ అపరిశుభ్ర పరిస్థితులు ఇలాగే కొనసాగితే విషజ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా గత ఐదు రోజులుగా గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వాటర్‌ ట్యాంక్‌ను ఎన్నో సంవత్సరాలుగా శుభ్రం చేయలేదని, దీంతో తాగునీటిలో పురుగులు వస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. క్లోరినేషన్‌ చేసిన సురక్షితమైన తాగునీటిని అందించడంలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.
గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదని గ్రామస్తులు అంటున్నారు. తాగునీటి సమస్యతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు.
వేంబాకం పంచాయతీ కార్యదర్శికి నాగలాపురం మేజర్‌ పంచాయతీ ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడంతో వేంబాకం గ్రామంపై ఆయన దృష్టి సారించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ సమయంలో మాత్రమే గ్రామానికి వస్తున్నారని, మిగిలిన సమయంలో గ్రామంలో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
మేజర్‌ పంచాయతీలో అధికంగా వ్యక్తిగత ఆదాయ వనరులు ఉండటం వల్లే కార్యదర్శి అటువైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారంటూ కొందరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.
వేంబాకం గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే వాటర్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసి, క్లోరినేషన్‌ చేసిన సురక్షితమైన తాగునీటిని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఐదు రోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పనితీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించి గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని వేంబాకం గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!