36వ వార్డు 4వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్‌కు సిఫార్సు.. నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు
ఎన్నికల నిర్వహణపై కలెక్టర్, ఎస్పీ సంయుక్త మీడియా సమావేశం
తిరుపతి, నవంబర్ 1 గరుడదాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించిన పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్ తెలిపారు.
ఆదివారం రాత్రి తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 556 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించినట్లు వెల్లడించారు. పుత్తూరులో 78.73 శాతం, నాయుడుపేటలో 72.77 శాతం, వెంకటగిరిలో 69.25 శాతం, సూళ్లూరుపేటలో 65.18 శాతం, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 47 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించారు.
* 36వ వార్డులో రీపోలింగ్‌కు సిఫార్సు
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 36వ వార్డు, 4వ పోలింగ్ కేంద్రంలో సాయంత్రం 4.50 గంటల సమయంలో కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా బ్యాలెట్ పత్రాలతో ఓటు వేసేందుకు ప్రయత్నించిన ఘటనపై వెంటనే స్పందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఇతర మున్సిపాలిటీల్లో సుమారు 50 శాతం సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ఇదే తరహాలో పటిష్ట ఏర్పాట్లతో ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలకు సహకరించిన ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
– నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు – ఎస్పీ
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ పురపాలక ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించామని, పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణ చేపట్టామని వెల్లడించారు.
నాయుడుపేట, వెంకటగిరి, తిరుపతి తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్న చిన్నచిన్న ఘటనలపై తక్షణమే స్పందించి మొత్తం నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఉపేక్షించేది లేదని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు కౌంటింగ్ ప్రక్రియకు కూడా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సుమారు 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, మిగిలిన కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
