-నల్ల దుస్తులతో నిరసన తెలిపిన బ్యాంకు ఉద్యోగులు…
అర్ధాంతరంగా మహాసభ వాయిదా
తిరుపతి మే 7:
తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు పి ఆర్ సి తో కూడిన జీతాలు కోసం 74 రోజులుగా రోడ్డు ఎక్కి వివిధ రకాలుగా నిరసనలు చేపడుతున్న బ్యాంకు పాలకవర్గం కనికరించడం లేదు. ఆదివారం కోపరేటివ్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బ్యాంకు చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి అధ్యక్షతన పాలకమండలి జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బ్యాంకు ఉద్యోగుల పిఆర్సి గురించి ప్రస్తావించకపోవడం తో బ్యాంకు ఉద్యోగులలో ఆందోళన నిరుత్సాహం ఏర్పడింది. ఈ క్రమంలో పి ఆర్ సి గురించి బ్యాంకు పాలకవర్గం ప్రస్తావించకపోవడంతో ఉద్యోగులంతా నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. బ్యాంకు కస్టమర్లు డివిడెంట్, బ్యాంకు ఉద్యోగుల పిఆర్సి గురించి పాలకవర్గాన్ని జనరల్ బాడీ సమావేశంలో నిలదీశారు. అయితే పాలకవర్గం దాటవేసే సమాధానం చెప్పి తమ చేతుల్లో ఏమీ లేదని అంటూ సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసి అక్కడ నుంచి జారుకున్నారు. కస్టమర్లు డివిడెంట్ ఫండ్ కోసం గతంలో పలుమార్లు పాలకవర్గాన్ని విన్నవించినప్పటికీ పట్టించుకోలేదు. జనరల్ బాడీ సమావేశం లో కస్టమర్లే బ్యాంకు అభివృద్ధికి పాటుపడుతున్న ఉద్యోగుల జీతభత్యాల గురించి ప్రస్తావిచ్చినప్పటికీ నిర్లక్ష్యపు ధోరణితో వెళ్లిపోయారు. గత 11 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో అప్పుల పాలయి కుటుంబాలను పోషిస్తున్నామని, తమకు రావలసిన 2015 నాటి పిఆర్సి తో కూడిన జీతాల కోసం పలుమార్లు బ్యాంకు పాలకవర్గాన్ని కోరినప్పటికీ పట్టించుకోకపోవడం దారుణం అని వాపోయారు. ఇలాంటి పాలకవర్గం ఉన్న లేనట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పిఆర్సి తో కూడిన జీతాలు ఇచ్చేంతవరకు నిరసనలు ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని కోపరేటివ్ బ్యాంకు ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు.
