ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమహీంద్రా ఫైనాన్స్ వసూళ్ల దాష్టీకం

మహీంద్రా ఫైనాన్స్ వసూళ్ల దాష్టీకం

📰 Generate e-Paper Clip

-చట్టాన్ని బురదలోకి లాగుతున్న రికవరీ ఏజెంట్ లు

-‘ఏం చేసుకుంటావో చేసుకో.. పోయి కేసు పెట్టుకో!’ – ఆడియో సాక్ష్యాలతో బయటపడ్డ అహంకారం

-ఎస్టీ మహిళ ఇంట్లోకి జొరబడి గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిన వైనం.. చిటమూరు మండలం మెట్టు గ్రామంలో కలకలం

-పాత రసీదులు ఇవ్వరు.. కొత్త బకాయిలంటూ వేధింపులు: మైక్రో ఫైనాన్స్ వేధింపులపై తిరగబడుతున్న బాధితులు !

చిటమూరు, జూలై 23 గరుడ ధాత్రి:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను, దేశ అత్యున్నత న్యాయస్థాన ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఫైనాన్స్ కంపెనీలు సాగిస్తున్న వసూళ్ల రాక్షసపర్వం శ్రుతిమించుతోంది! నాయుడుపేటలో కార్యకలాపాలు సాగించి ఇటీవల సూళ్లూరుపేటకు స్థానచలనం పొందిన ‘మహీంద్రా ఫైనాన్స్ ’ రికవరీ సిబ్బంది వసూళ్ల పేరుతో పేదలపై సాగిస్తున్న దాష్టీకం చిటమూరు మండలంలో తీవ్ర కలకలం రేపింది. మెట్టు గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన ఆడేపూడి మహిమ (భర్త: శీనయ్య) అనే పేద మహిళ ఇంట్లోకి చొరబడి, నిత్యం వంట వండుకునే గ్యాస్ సిలిండర్‌ను బలవంతంగా లాక్కెళ్లడం ఫైనాన్స్ సిబ్బంది దిగజారుడుతనానికి అద్దం పడుతోంది.

డబ్బులు నొక్కేశారు.. రసీదులు ఏవి ?

రెక్కాడితే గానీ డొక్కాడని గిరిజన కుటుంబానికి చెందిన మహిమ గతంలో నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో డబ్బులు చెల్లించారు. అయితే, ఆ సమయానికి రసీదులు ఇవ్వకుండా “ఆన్‌లైన్ పేమెంట్ అయ్యింది” అని నమ్మబలికారు. తాజాగా రంగంలోకి దిగిన కొత్త రికవరీ సిబ్బంది.. “పాత చెల్లింపులతో మాకు సంబంధం లేదు, మళ్లీ కట్టాల్సిందే”అంటూ భీకర ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగక, మహిళ ఇంట్లో ఉన్న అత్యవసర గ్యాస్ సిలిండర్‌ను జప్తు పేరుతో ఎత్తుకెళ్లడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని స్థానికులు మండిపడుతున్నారు.

-ఏం చేసుకుంటావో చేసుకో..’ -వాయిస్ రికార్డింగ్‌తో బట్టబయలైన బెదిరింపులు

ఈ దౌర్జన్యంపై బాధితురాలి తరఫున ఒక ప్రతినిధి రికవరీ సిబ్బందిని ప్రశ్నించగా, వారి అహంకారం పరాకాష్టకు చేరింది. “అసలు నువ్వు ఎవరివి? నీకెందుకు సమాధానం చెప్పాలి? ఏం చేసుకుంటావో చేసుకో.. పోయి కేసు పెట్టుకుంటావా పెట్టుకోపో!” అంటూ చట్టాన్ని, వ్యవస్థలను హేళన చేస్తూ అహంకారపూరితంగా మాట్లాడారు. ఈ బెదిరింపులకు సంబంధించిన పక్కా ఆడియో ఆధారాలు (వాయిస్ రికార్డింగ్‌లు) ప్రస్తుతం వారి వద్ద లభ్యమయ్యాయి. ఫైనాన్స్ కంపెనీల వెనుక ఉన్న అసలు స్వరూపాన్ని ఈ రికార్డింగ్‌లు ఎత్తిచూపుతున్నాయి.

-రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు పాతర.. పేదల ప్రాణాలతో చెలగాటం

ఫైనాన్స్ రికవరీ పేరుతో
గృహోపకరణాలు జప్తు చేయడం, బెదిరింపులకు దిగడం తీవ్రమైన నేరమని ఆర్‌బీఐ స్పష్టమైన నిబంధనలు విధించినప్పటికీ, మహీంద్రా ఫైనాన్స్ సిబ్బంది వాటిని ఏమాత్రం లెక్కచేయడం లేదు. గతంలోనూ ఇలాంటి వసూళ్ల వేధింపుల వల్ల అనేక పేద కుటుంబాలు ఊళ్లు విడిచి వెళ్లడమో లేదా తీవ్ర నిర్ణయాలు తీసుకోవడమో జరిగింది.

-ఉన్నత అధికారులు పోలీస్ లు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

బాధ్యతారహితంగా వ్యవహరించి, పేద ఎస్టీ మహిళను మానసిక క్షోభకు గురిచేసిన మహీంద్రా ఫైనాన్స్ రికవరీ సిబ్బందిపై గౌరవ పోలీస్ యంత్రాంగం, ఉన్నతాధికారులు తక్షణమే చట్టపరమైన విచారణ జరిపించాలి. చట్టవిరుద్ధంగా గ్యాస్ సిలిండర్‌ను తీసుకు వెళ్లిన వారి నీ కఠినంగా శిక్షించాలి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు, గ్రామస్థులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!