బియ్యం, మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలన.. డిజిటల్ బోధనపై ఆరా
విద్యార్థినులకు మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందించాలి: అధికారులకు స్పష్టం
దొరవారిసత్రం, జూలై 23 గరుడ ధాత్రి:
దొరవారిసత్రం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కేజీబీవీ గురువారం మండల తహసీల్దార్ రాజేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతులు మరియు ఆహార నాణ్యతను ఆయన క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు.
-బియ్యం నాణ్యత, స్టాక్ తనిఖీ
తనిఖీల్లో భాగంగా పాఠశాలలోని స్టోర్ రూమ్‌ను పరిశీలించిన తహసీల్దార్ రాజేంద్ర, అక్కడ భద్రపరిచిన నిత్యావసర సరుకులు మరియు బియ్యం నాణ్యతను స్వయంగా చేతిలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. సరుకుల నిల్వల రికార్డులను, స్టాక్ వివరాలను ఉపాధ్యాయులను, పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
-తరగతుల నిర్వహణ, డిజిటల్ బోధన పరిశీలన
అనంతరం తరగతి గదులను సందర్శించి బోధనా విధానాన్ని పరిశీలించారు. డిజిటల్ స్క్రీన్ల ద్వారా సాగుతున్న పాఠాలను, విద్యార్థినుల హాజరును పరిశీలించిన ఆయన.. విద్యార్థినులతో మాట్లాడి విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు. వంట గది మరియు భోజన శాలను సందర్శించి విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని, పరిశుభ్రతను తనిఖీ చేశారు.
-నాణ్యమైన విద్య, వసతులు అందించాలి
ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేంద్ర మాట్లాడుతూ.. విద్యార్థినులకు విద్యతో పాటు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. పాఠశాల ప్రాంగణం, వంటగది ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని పాఠశాల నిర్వహణాధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
