పోలేరమ్మ జాతర సందర్బంగా అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
వైభవంగా పోలేరమ్మ జాతర
జాతర నిర్వహణకు రూ.50 లక్షలు – తొలి విడతగా రూ.40 లక్షలు విడుదల
ఆలయ ఖాతాలో రూ.1.70 కోట్ల ఎఫ్‌డీ, రూ.25 లక్షలు జమ
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
గరుడధాత్రి న్యూస్ వెంకటగిరి/తిరుపతి, అక్టోబర్ 1:
శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర సందర్బంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలతో కలసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
వెంకటగిరి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం భక్తిశ్రద్ధలతో జాతర కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, శ్రీశ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పలు ప్రముఖ ఆలయాల ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నామని, వాటి నిర్వహణకు దేవాదాయ శాఖ తరఫున ప్రతి పండుగకు ఏటా రూ.50 లక్షల వరకు నిధులు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా పోలేరమ్మ జాతరకు ఈ ఏడాది రూ.50 లక్షలు మంజూరు చేసి, తొలి విడతగా రూ.40 లక్షలు విడుదల చేసినట్లు చెప్పారు. ఆలయ ఖాతాలు, ఖర్చుల వివరాలు సమర్పించిన అనంతరం మిగిలిన రూ.10 లక్షలు విడుదల చేస్తామని వెల్లడించారు. శ్రీ పోలేరమ్మ ఆలయానికి భక్తులు, దాతల సహకారంతో బంగారు కిరీటం, పాదాలు, హస్తాలు, స్వర్ణహారాలు తదితర ఆభరణాలు సమకూరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆలయానికి రూ.1.70 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా ఉంచడంతో పాటు, ఎస్బీఐ ఖాతాలో రూ.25 లక్షలు జమ చేసినట్లు చెప్పారు.
కొలితోట ప్రాంతానికి సంబంధించిన నిధులను కూడా భద్రపరుస్తామని, అవసరమైన సమయంలో ప్రభుత్వ అనుమతులతో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. ఆలయ నిధులు సక్రమంగా వినియోగించేలా పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలోని నాలుగు ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కింద ఏటా రూ.4.80 లక్షలు, మూడు ఆలయాల అభివృద్ధికి రూ.7.05 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 13 ఆలయాల నిర్మాణానికి రూ.4.60 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో అక్కడ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
రాపూరు మండలంలోని శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దత్తత ఆలయంగా అనుసంధానం చేయడం ద్వారా చెంచులక్ష్మి ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులను వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. జాతర అనంతరం జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కొలితోట ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన అభివృద్ధి చర్యలు చేపడతామని తెలిపారు.
వెంకటగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యూ లైన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు ఎండలో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా, క్రమపద్ధతిలో దర్శనం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారన్నారు. క్యూ లైన్లలో భక్తులు గంటకు పైగా వేచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించి అధికారులకు సహకరించాలని, భక్తుల దర్శనానికి ప్రాధాన్యతనిస్తూ క్యూ లైన్లను సక్రమంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ, శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ జాతరకు వచ్చే ప్రతి భక్తుడికి సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమన్నారు. భక్తుల రద్దీ, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై అన్ని శాఖలతో సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. భక్తులు అధికారుల సూచనలు పాటించి క్రమపద్ధతిలో దర్శనం చేసుకుని జాతరను విజయవంతం చేయడానికి సహకరించాలి అని కోరారు. జాతరను సమర్థవంతంగా నిర్వహించేందుకు నిరంతరం విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.
శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ల నాయకత్వంలో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, వైద్యారోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల రద్దీని నియంత్రించడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, భక్తులు, మీడియా ప్రతినిధులకు అందరికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమీషనర్ మహేశ్వర రెడ్డి, శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ దేవస్థానం ప్రత్యేక అధికారి విజయ రాజు, జిల్లా ఎండోమెంట్ అధికారి రామకృష్ణ, శ్రీకాళహస్తి ఆర్డీఓ బానుప్రకాష్ రెడ్డి, ఆలయ చైర్మన్ మురళి కృష్ణ, వెంకటగిరి తహసీల్దార్ శిరీష, ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
