ePaper
Sunday, October 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిహార్టీకల్చర్ హబ్‌పై ఆకట్టుకున్న డ్రోన్ షో

హార్టీకల్చర్ హబ్‌పై ఆకట్టుకున్న డ్రోన్ షో

📰 Generate e-Paper Clip

* ఉద్యాన హబ్‌తో రాయలసీమ, చిత్తూరు జిల్లా రూపురేఖల్లో మార్పు.
* 9.6 లక్షల రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం.. 49.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
* ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 01(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): ఉద్యాన హబ్‌తో రాయలసీమ, చిత్తూరు జిల్లా రూపురేఖల్లో మార్పు తీసుకువచ్చేలా 9.6 లక్షల రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం మరియు 49.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తెలిపారు.
రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ప్రజలు, యువతకు అవగాహన కల్పించేలా చిత్తూరు నగరంలోని ఆర్.వి.ఎస్. కళాశాల మైదానంలో గురువారం రాత్రి ఆకట్టుకునే డ్రోన్ షో నిర్వహించారు. రంగురంగుల డ్రోన్ల కాంతులతో ఆకాశంలో ప్రదర్శించిన వివిధ ఆకృతులు, ఉద్యానవన రంగ అభివృద్ధి ప్రణాళికలు ప్రజలు, యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాయలసీమలో నిరుద్యోగాన్ని తగ్గించి, వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలను భారీగా పెంచే లక్ష్యంతో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో అగ్రికల్చరల్, హార్టీకల్చర్ హబ్‌ను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రతిపాదిత ప్రణాళికలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే చిత్తూరులో డ్రోన్ షో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.శతాబ్దాలుగా కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమలో తగినంత నీటి వసతి లేక వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు వలస వెళ్లాల్సిన పరిస్థితులు గతంలో ఉండేవని పేర్కొన్నారు. ప్రస్తుతం హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా, గోదావరి జలాలను కుప్పం వరకు తీసుకువచ్చే చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. చిత్తూరు జిల్లాకు కూడా కృష్ణమ్మ, గోదావరి నీటిని అందించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును కోరిన వెంటనే రూ.105 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో నీటి సమస్య లేని రాయలసీమగా, చిత్తూరు జిల్లాగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
చిత్తూరు జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవన రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రైతు కుటుంబాలకు మెరుగైన ఆదాయ అవకాశాలు కల్పించేందుకు జిల్లాకు రూ.1,500 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.200 కోట్ల చొప్పున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ ద్వారా 9.6 లక్షల రైతు కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరడంతో పాటు 49.3 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల సాగు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాయలసీమ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
శుక్రవారం మదనపల్లెలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తదితరుల సమక్షంలో నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమానికి ప్రజల తరఫున, చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరఫున పూర్తి మద్దతు తెలియజేయాలని కోరారు.కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన, సమాచార పౌర సంబంధాల శాఖల అధికారులు, ప్రజలు, యువత, ఆర్.వి.ఎస్. కళాశాల, శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!