– ప్రజల్లో భరోసా కల్పించేందుకు మండల కేంద్రంలో పోలీసుల కవాతు
– నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్సై బి. రాఘవేంద్ర పిలుపు
– ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
పిచ్చాటూరు :
నవంబరు 5న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ఎస్సై బి. రాఘవేంద్ర ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది విస్తృతంగా ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటంతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని కల్పించడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టడమే ఈ ఫ్లాగ్‌మార్చ్ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై బి. రాఘవేంద్ర మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మండలవ్యాప్తంగా పటిష్ఠ పోలీసు నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఫ్లాగ్‌మార్చ్‌లో ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.
