ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై రాజకీయ చర్ఛ..!

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై రాజకీయ చర్ఛ..!

📰 Generate e-Paper Clip

పదవి ఉంది.. పలుకుబడి ఎక్కడ..?

-స్థానిక ఎన్నికల వేళ ఎక్కడా కనిపించని ఎమ్మెల్యే ”ఆది”..?

-పార్టీ పెద్దలతో దూరమా? లేక రాజకీయ వ్యూహమా?

నాగలాపురం, గరుడ ధాత్రి న్యూస్ :

సత్యవేడు నియోజకవర్గ రాజకీయాల్లో ఒకప్పుడు తనదైన ముద్ర వేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రస్తుతం ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
2019 నుంచి 2024 వరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన, 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే రెండోసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే ఆయన రాజకీయ ప్రస్థానంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఎమ్మెల్యే ఆదిమూలంకు సంబంధించి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో అప్పట్లో రాజకీయంగా తీవ్ర కలకలం రేగింది. ఈ వ్యవహారం టీడీపీ అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో ఆయనకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. పార్టీ పరంగా ఆయనకు ప్రాధాన్యత తగ్గిందనే ప్రఛారం సాగింది. మరోవైపు సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల నిర్వహణకు కూరపాటి శంకర్‌రెడ్డికి ప్రాధాన్యత కల్పించడంతో స్థానికంగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
అయినప్పటికీ ఎమ్మెల్యే ఆదిమూలం వెనక్కి తగ్గలేదు. తాను ప్రజల్లోనే ఉంటానని, పార్టీ పటిష్టత కోసం నిరంతరం పనిచేస్తానని పలుమార్లు ప్రకటించారు. గ్రామాల్లో పర్యటిస్తూ తన రాజకీయ ఉనికిని ఛాటుకునే ప్రయత్నం చేశారు. తనకు ప్రజాబలం ఉందని, తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటాననే సంకేతాలు ఇచ్చారు.

-క్షేత్రస్థాయిలో మాత్రం మౌనం..?

కొంతకాలం క్రితం ఎమ్మెల్యే ఆదిమూలం మళ్లీ దూకుడు పెంచుతున్నారనే ప్రఛారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా సాగింది. ‘ఆదిమూలంకు మళ్లీ పవర్ వచ్చింది.. ఇక ఆయన రాజకీయ తడాఖా చూపించబోతున్నారు’ అంటూ ఆయన అనుచరులు, అభిమానుల వర్గాల్లో చర్చ జరిగింది.
కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రఛారం ఊపందుకున్నప్పటికీ ఎమ్మెల్యే ఆదిమూలం క్షేత్రస్థాయిలో పెద్దగా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో రాజకీయంగా కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యే పాత్ర అత్యంత కీలకం. అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణుల సమన్వయం, అసంతృప్తులను బుజ్జగించడం, ప్రఛారాన్ని ముందుకు నడిపించడం వంటి బాధ్యతల్లో ఎమ్మెల్యే చురుకుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి కీలక సమయంలో ఆయన మౌనం వహించడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే ఆదిమూలం చుట్టూ గతంలో తిరిగిన పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం రాజకీయంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎన్నికల్లో తమకు అనుకూలమైన వారికి టికెట్లు ఇప్పించడంలో ఎమ్మెల్యే ఎంతవరకు కీలక పాత్ర పోషించారు, ఆయనను నమ్ముకున్న నాయకులకు పార్టీ నుంచి తగిన ప్రాధాన్యత లభించిందా, లేక పార్టీ అధిష్ఠానం నిర్ణయాల ముందు ఆయన మాటకు విలువ లేకుండా పోయిందా,అనే ప్రశ్నలు స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా…
ఒక నాయకుడి రాజకీయ బలం కేవలం పదవితోనే నిర్ణయించబడదు. ఆయన వెంట నడిచే కార్యకర్తలు, ప్రజల్లో ఉండే ఆదరణ, పార్టీ నిర్ణయాలపై ఆయనకు ఉండే ప్రభావం కూడా కీలకమే. ఈ నేపథ్యంలో ఆదిమూలం ప్రస్తుత రాజకీయ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది.

-ముమ్మార్లు..అధిష్ఠానం వ్యూహమేనా…?

సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ వ్యవహారాలపై కూరపాటి శంకర్‌రెడ్డికి ప్రాధాన్యత పెరగడం, మరోవైపు ఎమ్మెల్యే ఆదిమూలం రాజకీయంగా కనిపించకపోవడం వెనుక పార్టీ అధిష్ఠానం వ్యూహం ఉందా.. లేక ఎమ్మెల్యే స్వయంగా రాజకీయంగా కొంతకాలం మౌనం పాటిస్తున్నారా…అనేది స్పష్టత లేని అంశమే అయినా…
ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్నప్పటికీ నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో ఆయన పాత్ర ఎంతవరకు ఉందన్నది ఇప్పుడు ప్రధాన చర్చ కొనసాగుతున్నది.
ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి పనుల పర్యవేక్షణలో, కార్యకర్తలకు అందుబాటులో ఉండటంలో ఆయన చురుకుదనం ఎలా ఉందన్న అంశాలపై కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

-“ఆది” ఈజ్ కమింగ్ బ్యాక్..!
ఈజ్ ఇట్ ఫాజిబుల్..?

ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సత్యవేడు నియోజకవర్గ టీడీపీ రాజకీయాలకు ఒక కీలక పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యే స్థాయిలో ఎలాంటి సహకారం అందింది, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మళ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారా.., పార్టీ అధిష్ఠానం వద్ద తన ప్రాధాన్యతను తిరిగి సంపాదించుకుంటారా..,
ఒకప్పుడు గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తలకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే ఆదిమూలం ప్రస్తుతం కనిపించకపోవడం రాజకీయంగా ప్రధాన చర్చకు దారితీస్తోంది. పదవి ఉన్నా పార్టీపై పట్టు లేకపోతే ప్రయోజనం శూన్యమే ..నా..
..మొత్తానికి.. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాజకీయంగా వెనుకడుగు వేశారా,
లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా..,
అనేది ఆయనే స్పష్టం చేయాల్సి ఉంది. స్థానిక ఎన్నికల వేళ ఆయన మౌనం రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా, ఎన్నికల అనంతరం ఆయన అడుగులు ఎటువైపు పడతాయోనని సత్యవేడు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!