ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లలో గణనీయమైన పురోగతి

ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లలో గణనీయమైన పురోగతి

📰 Generate e-Paper Clip

– పొగాకు కొనుగోళ్ల పరిస్థితిపై సహచర మంత్రులు, ఎమ్మెల్యేల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన మంత్రి అచ్చెన్నాయుడు

*అమరావతి, జూన్ 11:* ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీవీ (FCV) పొగాకు వేలం ప్రక్రియ గత పది రోజులుగా మెరుగుదల సంకేతాలను చూపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కొనుగోలుదారుల భాగస్వామ్యం పెరగడం, మార్కెట్‌లో లిక్విడిటీ మెరుగుపడడం, వేలం కేంద్రాల్లో తిరస్కరణలు గణనీయంగా తగ్గడం సానుకూల పరిణామాలని ఆయన పేర్కొన్నారు. పొగాకు కొనుగోళ్ల పరిస్థితిపై గురువారం సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి, అలాగే పొగాకు పండించే జిల్లాల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. జూన్ 11 నాటికి టొబాకో బోర్డు ఆధ్వర్యంలోని వేలం వేదికల ద్వారా మొత్తం 15.65 మిలియన్ కిలోగ్రాముల ఎఫ్‌సీవీ పొగాకు మార్కెటింగ్ జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాలకు ప్రస్తుతం రోజుకు సుమారు 8,000 బేళ్ల పొగాకు వస్తుండటంతో మార్కెటింగ్ ప్రక్రియ సజావుగా సాగడమే కాకుండా కొనుగోలుదారుల పాల్గొనడం కూడా మెరుగుపడిందన్నారు. ఇటీవలి కాలంలో అత్యంత ముఖ్యమైన పరిణామం తిరస్కరణలు (Rejections) “నో బిడ్” (No Bid) స్థాయిలు గణనీయంగా తగ్గడమేనని మంత్రి తెలిపారు. గతంలో 30 నుంచి 37 శాతం మధ్య ఉన్న తిరస్కరణల శాతం ప్రస్తుతం సుమారు 20 శాతానికి తగ్గిందని చెప్పారు. ఇది మార్కెట్‌లో పొగాకుకు మెరుగైన ఆదరణ లభిస్తోందనే విషయాన్ని సూచిస్తోందని, అలాగే వ్యాపార అవసరాలకు అనుగుణంగా పొగాకు సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం నెలకొన్న మార్కెట్ పరిస్థితులపై సమగ్ర అవగాహన కోసం టొబాకో బోర్డు అన్ని వర్గాల భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 8న వ్యాపార వర్గాలు, ఎగుమతిదారులు, కొనుగోలుదారులు, రైతు ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని మార్కెట్‌లో లిక్విడిటీ పెంచేందుకు ఆచరణాత్మక వ్యూహాలపై చర్చించామని తెలిపారు. ఈ సమావేశాల్లో కొనుగోలుదారులు, వ్యాపార వర్గాలు అన్ని గ్రేడ్ల పొగాకును సమతుల్యంగా వేలానికి తీసుకువస్తే దేశీయ, ఎగుమతి మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా కొనుగోళ్లు మరింత పెంచే అవకాశం ఉంటుందని వెల్లడించారని చెప్పారు. మరోవైపు రైతులు కూడా తిరస్కరణలు తగ్గించి కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగితే అన్ని గ్రేడ్ల పొగాకును మార్కెట్‌కు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని వివరించారు. సమావేశాల్లో అన్ని వర్గాల మధ్య సమతుల్య గ్రేడ్ల సరఫరా, కొనుగోలుదారుల భాగస్వామ్యాన్ని పెంచడం, వేలం కేంద్రాలకు నియంత్రిత స్థాయిలో పొగాకు రాకలు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. ఈ నేపథ్యంలో టొబాకో బోర్డు అన్ని కొనుగోలు సంస్థలతో సమన్వయం చేస్తూ వారానికి కొనుగోలు లక్ష్యాలను నిర్దేశించి, పంటను క్రమబద్ధంగా మార్కెటింగ్ చేయడంతో పాటు రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను వేగంగా విక్రయించే దిశగా చర్యలు చేపడుతోందన్నారు. దాదాపు పది రోజుల క్రితం ఉన్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం కొనుగోలు సంస్థలు తమ భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచి మరింత చురుకుగా పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నాయని మంత్రి తెలిపారు. దీనివల్ల మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడి కొనుగోళ్లకు ఊపు వచ్చిందన్నారు. పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు, వ్యాపార వర్గాలు, కొనుగోలుదారుల సహకారం కొనసాగడంతో పాటు టొబాకో బోర్డు చేపడుతున్న చర్యల ఫలితంగా రానున్న వారాల్లో మార్కెట్‌లో లిక్విడిటీ మరింత మెరుగుపడి కొనుగోలు, మార్కెటింగ్ కార్యకలాపాలు మరింత వేగవంతమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!