ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు - కడ ప్రాజెక్టు...

శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు – కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్

📰 Generate e-Paper Clip

కుప్పం, ఆగస్టు 04(గరుడ స్హాత్రి న్యూస్):
కుప్పం లోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణానికి సంబంధించి ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్లు, టెలివిజన్ మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ స్పష్టం చేశారు.మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,గంగమ్మ ఆలయ అభివృద్ధి అంశంపై సోమవారం సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, రాష్ట్రస్థాయి అధికారులతో సాధారణ సమీక్ష సమావేశం మాత్రమే నిర్వహించామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివిధ నమూనాలు, ప్రతిపాదనలపై చర్చించినప్పటికీ ఎలాంటి తీర్మానం చేయలేదని, పునర్నిర్మాణంపై ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
సుమారు ఏడాదిన్నర క్రితం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. జాతరకు లక్షలాది మంది భక్తులు విచ్చేసే నేపథ్యంలో మరుగుదొడ్లు, మౌలిక వసతులు, పరిసరాల అభివృద్ధి వంటి పనులకు సుమారు రూ.8 నుంచి రూ.9 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, ముఖ్యమంత్రి సహకారంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.
సోమవారం నిర్వహించిన సమావేశం పూర్తిగా చర్చల కోసమేనని, ఎలాంటి తీర్మానాలు చేయలేదని, మీడియాకు ప్రకటించే స్థాయిలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని తెలిపారు.ఆలయానికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా అధికారికంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని, ఎలాంటి విషయాన్నీ రహస్యంగా ఉంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వికాస్ మర్మత్ తెలిపారు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటు, రహదారుల విస్తరణ, భూసేకరణ వంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అందువల్లే ప్రస్తుతం కుప్పంలో 32 పరిశ్రమలు ఏర్పడి, సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు.
అదేవిధంగా రీచ్-2, రీచ్-3 రహదారులు, బస్టాండ్, పార్కులు, పెరిమీటర్ వాల్, చెరువుల అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, హైమాస్ట్ లైట్లు, డీపీఓఎన్, హార్టికల్చర్, పీ-4, సంజీవని, కేర్ అండ్ గ్రో తదితర కార్యక్రమాలు ప్రజల సహకారంతోనే విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు.శ్రీ గంగమ్మ ఆలయం కుప్పం ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని, ప్రతి సంవత్సరం సుమారు ఐదు లక్షల మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి ఆలయానికి విచ్చేస్తారని తెలిపారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయానికి భక్తులకు తగిన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.
ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ నెల ఆగస్ట్ 31వ తేదీ వరకు కడ కార్యాలయంలో లిఖితపూర్వకంగా వినతులు, సూచనలు, అభిప్రాయాలు స్వీకరిస్తామని తెలిపారు.
ప్రజల నుంచి అందిన అభిప్రాయాలు, సూచనలను శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీతో సమగ్రంగా చర్చించిన అనంతరం, సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణంపై నిర్ణయం తీసుకోబడుతుంది అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!