చౌడేపల్లి ఆగస్టు 01 గరుడ దాత్రి న్యూస్
చౌడేపల్లి పరిధిలోని చిన్నకొండమర్రి గ్రామంలో శనివారం పాడిపశువులకు లంపిస్కిన్ (ముద్ద చర్మవ్యాధి) సోకకుండా నివారణ టీకాల కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ (మదనపల్లె) డాక్టర్ శ్రీనివాసులు నాయుడు, డాక్టర్ పవన్ కుమార్(చౌడేపల్లి ) కలిసి అధికారికంగా ప్రారంభించారు. నెల రోజుల పాటు టీకాల పంపిణీ ఈ వ్యాధి నివారణ టీకాల ప్రక్రియను ఈ రోజు నుండి ఆగస్టు 31 వరకు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో నిర్వహించనున్నారు. ఈ గడువులోగా మొత్తం 13,000 డోసుల టీకాలను పాడిపశువులకు వేయాలని లక్ష్యంగా నిర్ధారించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఈ సీజన్‌లో పశువులకు ముద్ద చర్మవ్యాధి సోకకుండా ఉండేందుకు పశువుల పాకల్లో రాత్రి వేళల్లో వేపాకు పొగ వేయాలని సూచించారు. దీనివల్ల ఈగలు, దోమలు పశువుల వద్దకు రాకుండా నివారించవచ్చని, తద్వారా పశువులను వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. చర్మంపై చిన్న చిన్న గడ్డలు లేదా నోడ్యూల్స్ ఏర్పడటం; ఆ తర్వాత అవి పగిలి రక్తం కారడం లేదా పుండ్లు కావడం. పశువులకు అధిక జ్వరం ఉండటం.
కళ్ల నుండి నీరు కారుతూ ఉండటం. చర్మం కింద ఉండే శోషరస కణుపుల వాపు. ఆకలి మందగించడం. పాల దిగుబడి గణనీయంగా తగ్గడం. కావున పాడి రైతులు వెంటనే సమీప రైతుసేవా కేంద్రాలు, గ్రామీణ పశువైద్యశాల సిబ్బంది ద్వారా తప్పనిసరిగా పాడిపశువులకు టీకాలు వేయించుకోవాలని కోరారు.
అలాగే, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా ఉన్నందున మేలుజాతి పశుగ్రాసాలను పెంపొందించుకోవాలని పాడిరైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డిప్రసాద్, భాస్కర్ రావు స్థానిక పాడిరైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
