ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చిన్నూరు చెరువులో అక్రమ తవ్వకాలు

చిన్నూరు చెరువులో అక్రమ తవ్వకాలు

📰 Generate e-Paper Clip

అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డ మహిళ

పలమనేరు, ఆగస్టు 03 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండల వ్యాప్తంగా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై చిన్నూరు గ్రామానికి చెందిన సునీత అనే మహిళ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రకృతి సంపదను దోచుకుంటున్న మట్టి మాఫియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆమె గంగవరం తహశీల్దార్ రేఖకు, అలాగే స్థానిక పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.ఈ సందర్భంగా సునీత విలేకరులతో మాట్లాడుతూ.. చిన్నూరు చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తోడేయడం విషయాలుపై తాను గత ఏప్రిల్ నెలలోనే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. నెలలు గడుస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మట్టి మాఫియా మరింతగా చెలరేగిపోతోందని ఆరోపించారు. స్థానిక అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్నే ఆసరాగా చేసుకుని మట్టి అక్రమార్కులు తనను తీవ్రంగా బెదిరిస్తున్నారని సునీత ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను, గ్రామానికి చెందిన చెరువును కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే, మట్టి మాఫియా నుంచి తనకు ప్రాణహాని ఎదురవుతోందని వాపోయారు. ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడం వెనుక అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ తక్షణమే స్పందించి చిన్నూరు చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, తనకు సరైన భద్రత కల్పించాలని సునీత కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!