నాగలాపురంలో స్వర్ణ గ్రామ పథకాలపై జిల్లా అధికారి సమీక్ష – డేటా ఖచ్చితత్వం, ఈ-కేవైసీ వేగవంతం చేయాలని ఆదేశాలు
తిరుపతి జిల్లా స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డ్ అధికారి శ్రీమతి బి. గంగా భవానీ గారు నాగలాపురం మండలంలోని నాగలాపురం-1 స్వర్ణ గ్రామాన్ని ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధి అధికారులతో కలిసి ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణ గ్రామ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, సిటిజన్ ఈ-కేవైసీ, పి4 కార్యక్రమాలు, అలాగే స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డ్ సిబ్బంది హాజరు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో కొన్ని కుటుంబాల విద్యా అర్హతలు నమోదు కాలేదని, 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల మొబైల్ నంబర్లు ధృవీకరించని రికార్డులు ఉన్నాయని గుర్తించారు. ఈ రికార్డులను తిరిగి సర్వేకు పంపించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.
ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా డేటాను అప్డేట్ చేయాలని ఆమె స్పష్టం చేశారు. అలాగే సిటిజన్ ఈ-కేవైసీ కార్యక్రమాన్ని వేగవంతం చేసి, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి పెండింగ్ కేసులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు.
ఈ సందర్శనలో భాగంగా సచివాలయం సిబ్బందితో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మరియు సిటిజన్ ఈ-కేవైసీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు పత్రికలు, మీడియా ద్వారా ప్రచారం చేయాలని మీడియా ప్రతినిధులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీ తేజస్విని, డిప్యూటీ ఎంపీడీవో రూప, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
